https://oktelugu.com/

Shreyas Iyer : పనికిరాడని పక్కన పెట్టారు.. ఇప్పుడు చూశారా ఏం చేశాడో?

శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్ ఆడాడు. 351 రన్స్ చేశాడు. కోల్ కతా సాధించిన విజయాలలో కీలక భూమిక పోషించాడు. ఆటగాళ్లు అందరికీ అవకాశాలు ఇస్తూ..కోల్ కతా కు తిరుగులేని విజయాలు అందించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2024 / 03:25 PM IST

    Shreyas Iyer

    Follow us on

    Shreyas Iyer : ” గాయం గాని చేశారంటే.. ఖాయంగా దేవున్నవుతాను” ఇదీ పుష్ప -1 సినిమాలో “ఏయ్ బిడ్డా” అనే పాటలో ఓ చరణం. ఈ పాట విడుదలైన తర్వాత.. పుష్ప లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు.. దానిని తమకు ఆపాదించుకున్నారు. వారు నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలియదు కానీ.. ఇప్పుడు ఆ చరణం కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే అతడు పడ్డ ఇబ్బందులు.. పడుతున్న ఆవేదన అటువంటిది కాబట్టి..

    గత ఏడాది జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. కొన్ని మ్యాచ్లలో శివాలెత్తిపోయి బ్యాటింగ్ చేశాడు. కానీ అతడిని టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు.. కనీసం వార్షిక కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. అతడేమైనా అనామక ఆటగాడు కాదు. కేవలం దేశవాళి క్రికెట్ లో ఆడటం లేదనే సాకును చూపించి టీమిండియా సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. బ్యాటింగ్ చేయగలడు. ఫీల్డింగ్ లో రాణించగలడు. కానీ అలాంటి ఆటగాడిని దూరం పెట్టారు. టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం.. వార్షిక కాంట్రాక్ట్ లో పేరు లేకపోవడంతో.. అయ్యర్ లో కోపం పెరిగింది. కసి తారస్థాయికి చేరింది. ఫలితంగా ఐపీఎల్ లో కోల్ కతా విజేతయింది. దాదాపు పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత కోల్ కతా విజేతగా ఆవిర్భవించింది. దీని అంతటికి కారణం శ్రేయస్ అయ్యర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. పరిమిత వనరులతోనే అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు.

    శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్ ఆడాడు. 351 రన్స్ చేశాడు. కోల్ కతా సాధించిన విజయాలలో కీలక భూమిక పోషించాడు. ఆటగాళ్లు అందరికీ అవకాశాలు ఇస్తూ..కోల్ కతా కు తిరుగులేని విజయాలు అందించాడు. నాయకుడంటే నడిపించేవాడని నిరూపించాడు. టి20 వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయకపోయినప్పటికీ.. వార్షిక కాంట్రాక్ట్ లో తనకు స్థానం లభించకపోయినప్పటికీ.. అయ్యర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడేంటో, అతని ఆట తీరు ఏంటో.. అతని వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ద్వారా చూపించాడు. ఇప్పటికైనా టీమిండియా సెలక్టర్లు అతడిని లెక్కలోకి తీసుకుంటారా.. ఒక వార్షిక కాంట్రాక్టు జాబితాలో స్థానం కల్పిస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు కోల్ కతా కు ట్రోఫీని అందించడంతో.. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా అయ్యర్ నియమితులవుతాడని అభిమానులు జోస్యం చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాల్సి ఉంది.