Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రతి విషయాన్ని చెబుతుంటాడు కాబట్టి.. అతడిని జట్టులో భోళా మనిషి అని పిలుస్తుంటారు. ఇలా మొహమాటం లేకుండా మాట్లాడటం వల్ల అయ్యర్ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డప్పటికీ.. అనేక సందర్భాలలో తనకంటూ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. అందువల్లే అతడు టీమిండియాలో విభిన్నమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత ఐపిఎల్ లో అతడు పంజాబ్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. వేలంలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన అయ్యర్.. ఆ తర్వాత తన పోరాట స్ఫూర్తితో.. నాయకత్వ పటిమతో పంజాబ్ జట్టుకు తిరుగులేని విజయాలు అందిస్తున్నాడు. గత కొన్ని సీజన్లుగా పంజాబ్ జట్టు గ్రూప్ దశ నుంచే వెళ్లిపోగా.. ఈసారి మాత్రం ఏకంగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలను అందిపుచ్చుకుంది. అయ్యర్ కేవలం బ్యాటర్ గా మాత్రమే కాకుండా.. సిసలైన ప్రణాళికలు అమలు చేసే ఆటగాడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అందువల్లే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నది.
Also Read : విధ్వంసకారుడే ఓపెనర్.. ఐపీఎల్ రీస్టార్ట్ లో ప్రేక్షకుల ఊహకందని ఇన్నింగ్స్ ఖాయం
ఇది ఐపీఎల్ రా బాబూ
ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో ఆగిపోయింది. దీంతో చాలామంది ఫారిన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. దీనిపై పంజాబ్ జట్టు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫారిన్ ప్లేయర్స్ లేకపోవడంతో పంజాబ్ జట్టు ఇబ్బంది పడుతుందని చాలామంది క్రికెట్ ప్రభావశీలమైన వ్యక్తులు కామెంట్లు చేశారు. ఇది పంజాబ్ జట్టు సాధించే విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై జట్టు మేనేజ్మెంట్ ఎటువంటి కసరత్తు చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు పంజాబ్ జట్టు నడక అద్భుతంగా సాగిందని, ఇకపై కష్టమేనని తమ వంతు విశ్లేషణ చేశారు.
ఇక దీనిపై అయ్యర్ తనదైన మార్క్ కామెంట్స్ చేశాడు..” ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల ఫారిన్ ప్లేయర్స్ వెళ్లిపోయారు. వారి భయాలు వారికుంటాయి. వారిని బలవంతంగా క్రికెట్ ఆడించలేము. వారితో బలవంతంగా ఏది చేయించలేము. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ఫారిన్ ప్లేయర్స్ మొత్తం గొప్ప ఆటగాళ్లు.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.. ఆ మాట అనడానికి కూడా నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు.. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పేరులోనే భారతీయత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే మెజారిటీ సంఖ్యలో ఉంటారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా అంటూ” అయ్యర్ చురకలు అంటించాడు. ఈ వీడియోను పంజాబ్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతిమంగా మాత్రం అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు ఆమోదం లభిస్తోంది.