Pakistan Cricket Team : పాక్ కు షాక్ ల మీద షాక్ లు.. హే భగవాన్.. బాబర్ సేనకు ఏంటి ఈ కష్టాలు?

బ్యాటర్లు చివరి దశలో చేతులెత్తేయడం పాకిస్తాన్ జట్టు తీరును ప్రదర్శించిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Written By: NARESH, Updated On : June 10, 2024 10:17 pm

T20 World Cup 2024 Pakistan Cricket Team Differences Between Babar Azam and Mohammad Amir

Follow us on

Pakistan Cricket Team : టి20 ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు సూపర్ ఓవర్ దాకా వెళ్లాయి. విన్ ప్రిడిక్షన్ 8 శాతం ఉన్న జట్టు గెలిచింది. తక్కువ పరుగులు నమోదైన చోట.. విజయం కోసం పోటాపోటీ నెలకొంటోంది. ముఖ్యంగా డ్రాప్ ఇన్ మైదానాల వల్ల భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. ఆటగాళ్లు తక్కువ పరుగులే నమోదు చేస్తున్నప్పటికీ.. అవి థ్రిల్లర్ సినిమాల లాగా అభిమానులను కుర్చీలకు కట్టిపడేస్తున్నాయి.. స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా వంటి పసికూన జట్లు.. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తూ.. వారెవ్వా అనిపిస్తున్నాయి.

టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ కోలుకోలేని షాక్ ఇస్తే.. పాకిస్తాన్ కు అమెరికా చుక్కలు చూపించింది . బలమైన శ్రీలంకను బంగ్లాదేశ్ మట్టి కరిపించింది. సౌత్ ఆఫ్రికా ను నెదర్లాండ్ వణికించింది.. ఇలాంటి ఫలితాలు పెద్ద పెద్ద జట్లను ఇంటిదారి పట్టిస్తున్నాయి. ముఖ్యంగా పసి కూనల లాంటి జట్ల దూకుడు వల్ల న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి జట్లు లీగ్ దశ నుంచే ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ లేకపోయినప్పటికీ.. స్కాట్లాండ్ జట్టు ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆ జట్టు తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది. వర్షం వల్ల అది రద్దయింది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ గెలుపొందడంతో.. ఇంగ్లాండ్ భవితవ్యం ప్రమాదకరంలో పడింది.

గ్రూపు – ఏ లో భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లున్నాయి. ఈ విభాగంలో పాకిస్తాన్ అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ గ్రూపులో భారత్ రెండు మ్యాచ్లు గెలిచి, నాలుగు పాయింట్లు మొదటి స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన చివరి రెండు మ్యాచ్లను కెనడా, అమెరికాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లు గెలవడం భారత జట్టుకు పెద్ద కష్టం కాదు. ఇక ఈ జాబితాలో ఉన్న అమెరికా పాకిస్తాన్, కెనడాతో విజయాలు సాధించి నాలుగు పాయింట్లు రెండవ స్థానంలో కొనసాగుతోంది. తన చివరి రెండు మ్యాచ్లను భారత్, ఐర్లాండ్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా 6 పాయింట్లతో అమెరికా సూపర్ -8 కు చేరే అవకాశం ఉంది.. ఒకవేళ రెండు మ్యాచ్లకు రెండు ఓడినప్పటికీ.. పాకిస్తాన్, ఐర్లాండ్ మూడు నాలుగు స్థానాల్లో నిలుస్తాయి.

పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్లను ఐర్లాండ్, కెనడాతో తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ సూపర్ -8 కు వెళ్లాలంటే అమెరికా తన చివరి రెండు మ్యాచ్లను భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాకిస్తాన్, అమెరికా సమానమైన పాయింట్లతో నిలుస్తాయి. మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు సూపర్ – 8 కు వెళ్తుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం పాకిస్తాన్ కంటే అమెరికా రన్ రేట్ అత్యంత మెరుగ్గా ఉంది. అమెరికా కంటే మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్లను భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. అయితే అమెరికన్ మైదానాల ప్రకారం చూసుకుంటే అది అంత ఈజీ అయ్యే పరిస్థితి లేదు.

అత్యంత కఠినమైన సవాళ్లు ఉన్నాయి కాబట్టే పాకిస్తాన్ సూపర్ 8 వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాబట్టి టి20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ తప్పదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా అమెరికా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. భారత్ తో ఆడిన మ్యాచ్ లో గెలిచినా భవితవ్యం మరో విధంగా ఉండేదని.. బ్యాటర్లు చివరి దశలో చేతులెత్తేయడం పాకిస్తాన్ జట్టు తీరును ప్రదర్శించిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.