https://oktelugu.com/

Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ కు షాక్… ప్రమాదంలో జట్టు భవితవ్యం… మేనేజ్మెంట్ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఒకప్పటి భారత జట్టు దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్ర కొనసాగుతున్నాడు. ఆ జట్టు 2022లో విజేతగా నిలవడంలో తీవ్రంగా కృషి చేశాడు. 2023లోనూ ఫైనల్ దాకా తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమించాడు. 2024 లో మాత్రం గుజరాత్ జట్టు ఆస్థాయిని అందుకోలేకపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 24, 2024 / 02:28 PM IST
    Follow us on

    Gujarat Titans  : 2022లో ఐపీఎల్ లోకి గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ సీజన్లోనే కప్ గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2023లో మరోసారి ఫైనల్ వెళ్లి చెన్నై చేతిలో ఓటమిపాలైంది. 2024లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2023 సీజన్లో అత్యంత విలువైన జట్టుగా పేరుపొందిన గుజరాత్ తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు వెళ్లిపోవడం..గిల్ కెప్టెన్ కావడంతో 2024 సీజన్లో ఆశించిన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోయింది. ఫలితంగా అత్యంత దారుణంగా గ్రూప్ దశలోనే ఎగ్జిట్ అయింది. అయితే వచ్చే సీజన్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించి, తమ మనసును చూరగొంటుందని అభిమానులు ఆశిస్తుంటే.. గుజరాత్ జట్టులో వరుసగా చోటు చేసుకుంటున్న మార్పులు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో వచ్చే ఐపిఎల్ లో ఆ జట్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరి ఈ ఉత్పాతాన్ని గుజరాత్ జట్టు యాజమాన్యం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    వెళ్ళిపోతున్నారు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఒకప్పటి భారత జట్టు దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్ర కొనసాగుతున్నాడు. ఆ జట్టు 2022లో విజేతగా నిలవడంలో తీవ్రంగా కృషి చేశాడు. 2023లోనూ ఫైనల్ దాకా తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమించాడు. 2024 లో మాత్రం గుజరాత్ జట్టు ఆస్థాయిని అందుకోలేకపోయింది. దీంతో నెహ్ర తన దారి తను చూసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా వర్గాల కథనం ప్రకారం గుజరాత్ జట్టు మేనేజ్మెంట్ ఆశిష్ నెహ్ర చెప్పినట్టు వినడం లేదని సమాచారం. ఆటగాళ్ల కొనుగోలు, ఎంపిక వంటి విషయాలలో నెహ్రకు, గుజరాత్ జట్టు యాజమాన్యానికి సరిపడటం లేదని తెలుస్తోంది. అందువల్లే నెహ్ర గుజరాత్ జట్టు నుంచి వెళ్ళిపోతున్నాడని, డైరెక్టర్ విక్రమ్ సోలంకి కూడా అదే బాటలో ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    వచ్చే సీజన్ కల్లా..

    వచ్చే సీజన్లో గుజరాత్ జట్టును మరింత బలోపేతం చేసేందుకు యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. నెహ్ర బయటికి వెళ్లిన నేపథ్యంలో అతడి స్థానంలో మరొక ముఖ్యమైన ఆటగాడిని కోచ్ గా నియమించేందుకు అడుగులు వేస్తోంది. నెహ్రస్థానంలో టీమిండియా ఒకప్పటి స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ యువరాజ్ సింగ్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది..”నెహ్ర బయటికి వెళ్లిపోయాడు. కారణాలు మాకు తెలియదు. పాత నీరు పోతే కొత్తనీరు కచ్చితంగా వస్తుంది. జట్టు బలోపేతమే ప్రస్తుతం మా ముందు ఉన్న అసలైన లక్ష్యం. దీనికోసం ఏం చేయాలో మాకు తెలుసు. అందువల్లే యువరాజ్ సింగ్ తో చర్చలు జరుపుతున్నాం. అవి త్వరలోనే తుది రూపు సంతరించుకుంటాయి. ఈ సీజన్లో యువరాజ్ సింగ్ మా జట్టుతో ప్రయాణం మొదలుపెడతారు. యువరాజ్ సింగ్ రాకపట్ల మేము కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. మా జట్టు ఆటగాళ్లు కూడా అతని ఆధ్వర్యంలో మరింత రాటు తేలుతారని నమ్మకం ఉంది. కచ్చితంగా మేము బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వచ్చేస్తామని” గుజరాత్ యాజమాన్యం చెబుతోంది.

    సుముఖంగా ఉన్నాడా?

    గుజరాత్ జట్టుకు కోచ్ గా వచ్చేందుకు యువరాజ్ సింగ్ సుముఖంగా ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఓ స్పోర్ట్స్ ఛానల్ కథనం ప్రకారం యువరాజ్ గుజరాత్ జట్టు కోచ్ గా వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. యువరాజ్ సింగ్ తర్ఫీదు ఇచ్చిన అభిషేక్ శర్మ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున అదరగొట్టాడు. ఇటీవల జింబాబ్వే టోర్నీ లోనూ సెంచరీ చేశాడు. అయితే యువరాజ్ శిక్షణలో గుజరాత్ ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో తమ ఆట తీరు ప్రదర్శిస్తారని.. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తారని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు.