HomeతెలంగాణCM Revanth Reddy: ఐఐటీ సీటు వచ్చినా.. గొర్రెలు కాసిన విద్యార్థిని.. మీడియా కథనాలతో స్పందించిన...

CM Revanth Reddy: ఐఐటీ సీటు వచ్చినా.. గొర్రెలు కాసిన విద్యార్థిని.. మీడియా కథనాలతో స్పందించిన సీఎం.. ఆర్థిక చేయూత

CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పరీక్షలు ఏదైనా.. ర్యాంకుల్లో ముందు వరుసలో ఉంటున్నారు. నీట్, ఐఐటీ, జేఈఈతోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. జాతీయస్థాయిలో ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. చదువులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇందుకు గూగుల్, విప్రో లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల సీఈవోలే ఉదాహరణ. అయితే కొంతమంది చదువుల తల్లి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకుండా ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎలాంటి కోచింగ్, ఆర్థిక సపోర్టు లేకుండా వాటిని అధిగమించి ఉత్తమ ర్యాకుంగు సాధించడంతోపాటు ఉన్నత విద్యాసంస్థల్లో సీటు సాధిస్తున్నారు. అయితే ఆ కోర్సులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిధిలోకి రాకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలులో లేకపోవడం వంటి కారణాలతో ఉన్నత విద్యకు అవసరమయ్యే ఫీజులు కట్టలేకపోతున్నారు. దీంతో చదువులకు దూరమవుతున్నారు. బాగా చదువకోవాలని ఆశపడుతున్నా పరిస్థితులు మాత్రం అనుకూలించక వారి ప్రతిభ అడవి కాచిన వెన్నెలలాగే మారుతోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతి ఐఐటీలో సీటు వచ్చినా చదువుకోలేని పరిస్థితి ఉంది. పైచదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా, ప్రతిభ ఉన్నా చదువుకోలేని పరిస్థితి వచ్చింది. వీర్నపల్లి మండలం గోనే నాయక్‌ తండాకు విద్యార్థిని కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తండాకు చెందిన బదావత్‌ రాములు–సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకుని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబర్చింది. ఎస్టీ కేటగిరీలో… 824వ ర్యాంక్‌ సాధించింది. ఆమెకు పాట్నా ఐఐటీలో సీటు లభించింది. అయితే రూ.3 లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఇంట్లో పెంచుతున్న మేకలను కాస్తోంది.

సమీపిస్తున్న గడువు..
మధులత పాట్నా ఐఐటీలో సీటు పొందాలంటే జూలై 27వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. లేదంటే సీటు రద్దవుతుంది. వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు బిడ్డలను చదివించాడు మధులత తండ్రి రాములు. మధులతను ఐఐటీ చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు సాయం చేస్తేనే చదవిస్తానంటున్నాడు. దాతలు సాయం చేస్తే గిరిజనబిడ్డకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం దక్కుతుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోనే రాముల కుటుంబం ఉంటోంది. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ముగ్గురూ ఆడపిల్లలే అయినా వారిని ఉన్నత చదువులు చదివించారు.

పేదరికమే ఉన్నత విద్యకు అడ్డు..
రాములు–సరోజ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇద్దరు కూతుళ్లను డిగ్రీ వరకు చదివించారు. చిన్న కూతురు కూడా బాగా చదవి జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది. పై చదువులు చదవాలన్న ఆశతో జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసి మంచి ర్యాంకు సాధించింది. అయితే కటిక పేదరికంతో తండ్రి ఫీజు కట్టలేడని తెలిసి మేకల కాపరిగా మారింది. ఎవరన్నా దాతల సహకారంతో పై చదువులు చదవాలని ఆశతో ఎదురు చూస్తుంది.

స్పందించిన సీఎంవో..
మధులత పరిస్థితిపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన సీఎంవో వెంటనే విద్యార్థిని వివరాలు ఆరా తీసింది. తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులతకు తక్షణ సాయంగా రూ.1.50 లక్షలు అందించాలని ఆదేశించారు. పేదరికంతో ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులకు ఈ సాయం కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఎం సహాయంతో మధులత ఐఐటీ చదివే అవేందుకు మార్గం సుగమమైంది. పలువురు దాతలు కూడా విద్యార్థిని చదువుకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version