Shakib Al Hasan: చివరికి బంగ్లా క్రికెటర్లు కూడా ఏకిపడేస్తున్నారు.. పాపం పాక్ జట్టు ఎంతకు దిగజారిపోయింది?

అప్పుడప్పుడో 2021లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత విదేశాలలో దేవుడెరుగు.. ఇంతవరకు స్వదేశంలో మరోసారి టెస్ట్ సిరీస్ దక్కించుకోలేకపోయింది. ఇక ద్వైపాక్షిక టోర్నీలలో ఆడుతోంది గాని.. ఓడిపోతూ వస్తోంది. ఇలా ఎన్నో ఓటములు.. మరెన్నో పరాభవాలు.. చివరికి స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టు చేతిలోనూ వైట్ వాష్.. ఇలాగైతే పాక్ జట్టు బాగుపడేది ఎప్పుడు..

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 3:27 pm

Shakib Al Hasan

Follow us on

Shakib Al Hasan: ” మేమంతా ఇటీవలి వైఫల్యాలపై చర్చించాం. కచ్చితంగా గొప్ప నిర్ణయం తీసుకుంటాం. గ్రేట్ కం బ్యాక్ ఇస్తాం. అన్ని ఫార్మాట్ లలోనూ నెంబర్ వన్ గా నిలబడతాం. కచ్చితంగా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాం. మునుపటిలాగా కీర్తిని సంపాదిస్తాం”. ఈ మాటలు అన్నది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ కోచ్ జాసెన్ గిలెస్పీ. గిలెస్పి ఈ మాటలు మాట్లాడిన ఒక్క రోజులోనే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ ఉల్ హసన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పేరు ప్రస్తావించకుండానే అసలు విషయం చెప్పాడు. ” గత 12 ఏళ్లుగా భారత్ స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా ప్రత్యర్థి జట్టుకు అప్పగించలేదు. విదేశాల్లోనూ భారత్ అదే స్థాయి ఆట తీరు ప్రదర్శిస్తుంది. అందువల్లే టెస్ట్ లలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి జట్టును స్వదేశంలో ఓడించడం అంత సులభం కాదు. పైగా వారు స్వదేశంలో మరింత బలవంతంగా ఉంటారు. వారికి సరైన పోటీ మాత్రం మేము ఇవ్వగలం. అంతకుమించి అంటే.. అది అతిశయోక్తి మాత్రమే. ప్రస్తుతం మేము టెస్ట్ ర్యాంకింగ్ లో నాలుగో స్థానంలో ఉన్నాం. అది మాకు గర్వకారణం. పాకిస్తాన్ జట్టుకు గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో ఆ జట్టు తేలిపోతుంది. వరుస వైఫల్యాలతో విమర్శలను మూటకట్టుకుంటుంది. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేరు. ఆ ప్రకారం చూసుకుంటే మేమే వారి కంటే సీనియర్ ఆటగాళ్లమని” హసన్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జట్టును 2-0 తేడాతో ఓడించామని.. తొలిసారి పాకిస్తాన్ వేదికగా సిరీస్ గెలిచామని హసన్ వివరించాడు.

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

హసన్ ఆ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టును భారతీయ నెటిజన్లు ఆడుకుంటున్నారు. ” ఒక్కడికి అనుభవం లేదు. కోచ్ తో ఇంగ్లీషులో మాట్లాడలేరు. చివరికి స్వదేశంలో టెస్ట్ సిరీస్ గెలవలేరు. ఇక ఆటగాళ్ల మధ్య విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ సమయంలో ఎలా స్పందిస్తారో తెలియదు. అలాంటి వాళ్ళతో జట్టును నడిపిస్తున్నారంటే సాహసమనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ జట్టు కోచ్ తో ఇంగ్లీషులో మాట్లాడండి. అతడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. అప్పుడే మీ జట్టుకు కాస్తో కూస్తో లాభం జరుగుతుంది. లేకుంటే అంతే సంగతులు. ఇదిగో చివరికి బంగ్లాదేశ్ ఆటగాళ్లతో కూడా మాటలు పడాల్సి వస్తుందని” భారతీయ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ నెటిజన్లు విరుచుకుపడడంతో పాక్ నెటిజన్లు ఎలా స్పందించాలో తెలియక సైలెంట్ అయిపోయారు.