Sachin Tendulkar: ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే చాలామంది బోరింగ్ ఫార్మాట్ అనేవారు. రోజులకొద్దీ మ్యాచ్ లు చూడలేక విసుకునేవారు. అయితే అసలైన మజా టెస్ట్ క్రికెట్ ద్వారానే లభిస్తుంది.. ఆటగాళ్లల్లో నైపుణ్యాలను, ప్రశాంతతను, ఓపికను టెస్ట్ క్రికెట్ ప్రదర్శిస్తూ ఉంటుంది. అందువల్లే ఎందరో గొప్ప ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉంటారు. దశాబ్దాలుగా అతడు ప్రపంచ క్రికెట్ ను శాసించాడు.. అయితే అతడు క్రికెట్ గాడ్ గా మారింది మాత్రం టెస్టుల ద్వారానే.. ఒకానొక దశలో సచిన్ ఫామ్ కోల్పోయాడు. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. పరుగుల వరద పారించే అతని బ్యాట్ 13 ఇన్నింగ్స్ ల పాటు నిశ్శబ్దంగా మారింది. 19.4 సరాసరితో పరుగులు చేస్తూ నిస్సారంగా అయిపోయింది. ఈ దశలో అద్భుతమైన పునరాగమనం చేశాడు సచిన్ టెండూల్కర్.
ఎన్నో ఉన్నప్పటికీ
సచిన్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఉన్నాయి. అయితే అందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచే ఇన్నింగ్స్ లలో ఒకటి మాత్రం 2004లో చోటుచేసుకుందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా జట్టుపై జరిగిన నాలుగో టెస్టులో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు..నాలుగో డౌన్ లో వచ్చిన అతడు 436 బంతుల్లో 241 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 33 ఫోర్లు ఉన్నాయి. సచిన్ కెరియర్లో ఎన్నో డబుల్ సెంచరీలు, మరెన్నో సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ డబుల్ సెంచరీ మాత్రం అత్యంత ప్రత్యేకం. ఈ మ్యాచ్ కు ముందు సచిన్ వరుసగా విఫలమయ్యాడు. ఆ దశలో అతడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తన అద్భుతమైన బ్యాటింగ్ తో విమర్శకుల నోర్లు మూయించాడు. ఇదే దశలో తనకు నచ్చిన ఒక్క కవర్ డ్రైవ్ ఆడకుండా డబుల్ సెంచరీ చేశాడు.. సచిన్ స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లకు పెట్టింది పేరు. మెక్ గ్రాత్, బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ లాంటి బౌలర్ల బౌలింగ్ లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడు సచిన్. అలాంటి వ్యక్తి ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదు.
ఊరించే బంతులు వేసినప్పటికీ..
జేసన్ గిలస్పీ, నాథన్ బ్రాకెన్, బ్రెట్ లీ వంటి వాళ్ళ బౌలింగ్ లోను అతడు ఆ షాట్ ఆడలేదు. ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతులను అలానే వదిలేశాడు. స్ట్రైట్ వికెట్, లెగ్ సైడ్ పడిన బంతులను మాత్రమే బౌండరీలుగా తరలించాడు. అయితే ఆ సిరీస్ లో అంతకు ముందు జరిగిన మ్యాచ్లలో కవర్ డ్రైవ్స్ ఆడబోయి సచిన్ అవుట్ అయ్యాడు. అయితే కంగారు బౌలర్లు అలాంటి బంతులు వేసి సచిన్ ను మరోసారి బురిడీ కొట్టించాలని ప్రయత్నించారు.. అయితే సచిన్ మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడాలని మానసికంగా సిద్ధమయ్యాడు. అలా తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కంగారు బౌలర్లకు రుచి చూపించాడు..