https://oktelugu.com/

IND vs SA 4th T20 : వండరర్స్ లో వండర్.. సఫారీల బౌలింగ్ ను చెడుగుడాడారు.. తగలబెట్టేసిన సంజూ,తిలక్.. సెంచరీల మోతతో రికార్డులన్నీ బద్దలు

బౌలర్ ఎవరనేది చూడలేదు. గట్టిగా కొడితే ఫోర్.. ఊపి కొడితే సిక్సర్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. జోహెన్నెస్ బర్గ్ స్టేడియాన్ని గల్లీ క్రికెట్ మైదానం చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు నిద్రలేని రాత్రిని పరిచయం చేశారు టీమిండియా ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజు శాంసన్.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 10:39 PM IST

    Sanju Samson, Tilak Verma

    Follow us on

    IND vs SA 4th T20 :నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు చివరిదైన నాలుగో మ్యాచ్ ఆడుతున్నాయి. జోహెన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. అభిషేక్ శర్మ(36) వేగంగా ఆడే క్రమంలో ఔటైనప్పటికీ.. మరో ఓపెనర్ సంజు శాంసన్(109*), తిలక్ వర్మ (120*) అదరగొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 283 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజు శాంసన్ సెంచరీలు చేయడం విశేషం. రెండో వికెట్ కు అజేయంగా వీరిద్దరూ 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

    సిక్సర్ల మీద సిక్సర్లు

    టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం నూటికి నూరు పాళ్లు సరైనదని నిరూపిస్తూ ఓపెనర్లు బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ, సంజు తొలి వికెట్ కు 73 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత తిలక్ వర్మ మైదానంలోకి వచ్చాడు. గత మ్యాచ్లో కెప్టెన్ ను పట్టు పట్టి వన్ డౌన్ లోకి వచ్చిన అతడు.. ఈ మ్యాచ్ లోను అదే స్థానంలో బ్యాటింగ్ చేశాడు. దూకుడుకు మారుపేరుగా.. విధ్వంసానికి పర్యాయపదంగా.. తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో 120 పరుగులు చేశాడు. మరో ఆటగాడు సంజు 56 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 109 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ కలిపి మొత్తం 23 సిక్సర్లు కొట్టారు. ఇందులో అభిషేక్ శర్మ నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇక ఫోర్ల పరంగా చూసుకుంటే మొత్తంగా 17 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో సంజు 6, అభిషేక్ 2, తిలక్ వర్మ 9 బౌండరీలు సాధించారు.

    8 మంది బౌలర్లతో బౌలింగ్..

    73 పరుగుల వద్ద టీమ్ ఇండియా తొలి వికెట్ కోల్పోగా.. తిలక్ వర్మ, సంజు దక్షిణాఫ్రికా బౌలర్లకు సింహ స్వప్నం లాగా మారారు. వీరిని విడదీయడానికి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రం ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. చివరికి అతడు కూడా రెండు ఓవర్లు బౌలింగ్ వేశాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు 10 కంటే తక్కువగా ఎకానమీ నమోదు చేయలేదంటే భారత బ్యాటర్లు ఎలా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్టబ్స్ వేసిన ఒక ఓవర్ లో టీమిండి ఆటగాళ్లు 21 పరుగులు పిండుకున్నారు. ఇక సిమిలానే మూడు ఓవర్లు బౌలింగ్ వేస్తే.. 47 పరుగులు సాధించారు. మొత్తంగా జోహెన్నెస్ బర్గ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లకు టీమ్ ఇండియా ఆటగాళ్లు నిద్రలేని రాత్రిని పరిచయం చేశారు.

    ఇవేం ఎక్స్ ట్రా లు

    టీమ్ ఇండియా బ్యాటర్ల దూకుడు అలా ఉంటే.. దక్షిణాఫ్రికా బౌలర్ల బౌలింగ్ మరింత దారుణంగా ఉంది. 18 పరుగులను దక్షిణాఫ్రికా బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో ఇచ్చారు. ఇందులో 17 వైడ్లు. టీమిండియా ఆస్థాయిలో స్కోర్ చేయడానికి దక్షిణాఫ్రికా బౌలర్ల ఎక్స్ ట్రాలు కూడా ఒక కారణమే.