IND VS SA T20 Match : చివరిదైన నాలుగో టి20 జోహెన్నేస్ బర్గ్ లో జరుగుతోంది.. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత మూడు మ్యాచ్లలో దక్షిణాఫ్రికా టాస్ గెలవగా.. మూడు సార్లూ టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక నాలుగోసారి టీమిండియా టాస్ గెలవగా.. బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నిర్ణయం సరైనదే అని చెప్తూ టీమ్ ఇండియా ఓపెనర్లు కదం తొక్కారు. సంజు (79*), అభిషేక్ శర్మ (36) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.. వీరిద్దరూ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 73 పరుగులు జోడించారు. ఇటీవరి రెండు టి20 మ్యాచ్ లలో సున్నా పరుగులకే ఔటై నిరాశపరచిన సంజు.. ఈ మ్యాచ్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే అతడు 79 పరుగులు (ఈ కథనం రాసే సమయానికి) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ వైపుగా పరుగులు పెడుతున్నాడు. సంజు తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లోనూ అతడు శతకం సాధించాడు. అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత తిలక్ వర్మ క్రీజ్ లోకి వచ్చాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన అతడు.. ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు 21 బంతులు ఎదుర్కొని 49 పరుగులు (ఈ కథనం రాసే సమయానికి) చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా 13 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 177 పరుగులు చేసింది.
అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికాపై అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న టీమిండియా.. టి20 క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ ఆడిన భారత్.. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి 10 ఓవర్లు ముగిసి సమయానికి ఒక వికెట్ కోల్పోయి 152 పరుగులు చేసింది. మళ్లీ తన రికార్డుకు తనే చేరువగా వచ్చింది. జోహెన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న చివరికి 20 లో భారత్ తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇది విదేశాలలో t20 ఫార్మేట్లో టీమ్ ఇండియా సాధించిన హైయెస్ట్ స్కోర్. ఇక 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంక పై జరిగిన టి20 మ్యాచ్ లో భారత్ తొలి 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రెండో వికెట్ కు ఇప్పటివరకు తిలక్ వర్మ, సంజు 49 బంతుల్లో 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.