Sanju Samson: ఇప్పుడున్న పరిస్థితుల్లో.. విపరీతమైన పోటీ నెలకొన్న సందర్భంలో.. ఒక ఆటగాడికి టీమిండియాలో చోటు దక్కడం అత్యంత కష్టం. కానీ ఆ ఆటగాడికి అవకాశం లభించింది. టి20 వరల్డ్ కప్ లో ఆడే జట్టులో చోటు దక్కింది. కానీ ఆ అవకాశాన్ని అతడు నిలుపుకోలేకపోతున్నాడు. పోటీ ఆటగాడికి సందు దొరికేలా వ్యవహరిస్తున్నాడు. ఇలా అయితే అతడి కెరియర్ ప్రమాదంలో పడ్డట్టే అని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టుగా సంజు సాంసన్ అదరగొట్టాడు. రాజస్థాన్ జట్టును ముందుండి నడిపించాడు. ఏకంగా సెమీఫైనల్ దాకా తీసుకెళ్లాడు.. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఓడిపోయింది గాని.. లేకుంటే కోల్ కతా జట్టుకు ఫైనల్ లో గట్టి పోటీ ఇచ్చేదే. రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా సంజు అదిరిపోయే ఆట ఆడాడు. 16 మ్యాచ్ లలో 531 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 86 పరుగులుగా ఉంది. అంతర్జాతీయ టి20 కెరియర్ ప్రకారం చూసుకుంటే.. ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడిన సంజు.. 374 పరుగులు చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 77.
ఐపీఎల్ లో సంజు ప్రతిభ చూపించిన నేపథ్యంలో t20 వరల్డ్ కప్ లో అతడికి స్థానం కల్పించారు. వాస్తవానికి బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపించారు. అయితే చివరి దశలో సంజు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అదిరిపోయే ఆట ప్రదర్శించిన నేపథ్యంలో.. అతడికి కూడా అవకాశం కల్పించారు. అయితే సంజు స్పిన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలింగ్ లో సమర్థవంతంగా ఆడగలడు. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే అతడికి ప్రమోషన్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టి మరీ సంజు ను ఓపెనర్ గా బరిలోకి దింపారు. అయితే వచ్చిన అవకాశాన్ని సంజు చేజేతులా జారవిడుచుకున్నాడు.
సంజుకు ఈ టి20 వరల్డ్ కప్ లో పంత్ నుంచి తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో తన ఆటతీరుతో ఆకట్టుకోవాల్సిన సమయంలో సంజు తేలిపోయాడు. ఇదే మ్యాచ్లో రిషబ్ పంత్ అర్థ సెంచరీ తో చెలరేగిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి ఆటగాడు తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ, రిషబ్ పంత్ బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేసి భారత జట్టు స్కోరును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు.. ప్రాక్టీస్ మ్యాచ్లో సంజు కేవలం ఒకే ఒక పరుగు చేసి, వికెట్ల ముందు దొరికిపోవడంతో.. సోషల్ మీడియాలో అతనిపై ట్రోల్స్ మోత మోగుతోంది. ” ఎంతో పోటీ ఉన్న క్రమంలో అవకాశం కల్పిస్తే.. బంగారు పళ్లెంలో తీసుకెళ్లి పంత్ కు అప్పగిస్తున్నాడని” సంజు ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.