Rishabh Pant: నువ్వేనా భయ్యా.. రెండేళ్ల పాటు క్రికెట్ కు దూరమైంది.. ఇలా ఆడుతుంటే ఎవడూ నమ్మడు

రిషబ్ పంత్ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. రోడ్డు ప్రమాద సమయంలో రెండు నెలలపాటు కనీసం అతడు పళ్ళు కూడా తోముకోలేకపోయాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 7:55 am

Rishabh Pant

Follow us on

Rishabh Pant: అది అమెరికా.. శనివారం.. మధ్యాహ్నం కావస్తోంది.. టి20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ ఫేవరెటే, కానీ ఎక్కడో మూల బంగ్లాదేశ్ సంచలన ఆట తీరు ప్రదర్శిస్తుందని చిన్నపాటి సంశయం. ఈ క్రమంలో భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. సంజు సాంసన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. మెరుపు వేగంతో ఈ జోడి పరుగులు తీస్తుందనుకుంటే.. జట్టు స్కోరు 11 పరుగులకు చేరుకోగానే సంజు (1) షారీ ఫుల్ ఇస్లాం బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత్ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మైదానంలోకి వచ్చాడు రిషబ్ పంత్. ఇటీవలి ఐపిఎల్ లో రిషబ్ ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. అయితే భారత మైదానాలకు, అమెరికా మైదానాలకు చాలా తేడా ఉంటుంది. అటువంటి మైదానంపై పంత్ నిలబడగలడా? బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఎదుర్కోగలడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పంత్ ధైర్యంగా నిలబడ్డాడు.

ఏమాత్రం భయపడకుండా.. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. బంగ్లా బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో ఏకంగా 53 పరుగులు చేశాడు. 165.62 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. అయితే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఒకవేళ అతడు గనుక అలాగే క్రీజ్ లో ఉండి ఉంటే కచ్చితంగా సెంచరీ కొట్టేవాడని అభిమానులు చెబుతున్నారు. దూకుడు అయిన బ్యాటింగ్ తో ఉన్నంతసేపు మైదానాన్ని రిషబ్ పంత్ హోరెత్తించాడు.

రిషబ్ పంత్ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. రోడ్డు ప్రమాద సమయంలో రెండు నెలలపాటు కనీసం అతడు పళ్ళు కూడా తోముకోలేకపోయాడు. అడుగు తీసి అడుగు కూడా బయట వేయలేకపోయాడు. ఆ ప్రమాదంతో చాలామంది అతడి కెరియర్ ముగిసిందనుకున్నారు. కోలుకున్నా క్రికెట్ ఆడలేడని భావించారు. కానీ, అతడు గోడకు కొట్టిన బంతి లాగా తిరిగి లేచాడు. తనకు తానే ధైర్యం చెప్పుకొని పునరావిష్కరించుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా మారాడు. తన నాయకత్వ పటిమతో ఆకట్టుకున్నాడు. ఇటీవలి ఐపిఎల్ 17వ సీజన్లో 13 మ్యాచ్లు ఆడాడు. 446 రన్స్ చేశాడు. ఇందులో అతడి అత్యధిక స్కోరు 88*. బంగ్లాదేశ్ పై ఆదివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ పంత్ అదే సత్తా చూపించాడు.. పంత్ ఆట తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది..” నువ్వేనా భయ్యా రెండు సంవత్సరాలపాటు క్రికెట్ కు దూరంగా ఉంది.. నువ్వు ఇలా ఆడుతుంటే ఎవడూ దాన్ని నమ్మడు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.