https://oktelugu.com/

Lok Sabha Elections 2024: ఐదో విడత పోలింగ్‌ షురూ.. జోరెవరిదో!

ఐదో విడత పోలింగ్‌లో కేంద్రం మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 20, 2024 / 09:25 AM IST

    Lok Sabha Elections 2024

    Follow us on

    Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ సోమవారం(మే 20న) ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరుగనుంది. 49 స్థానాలకు 695 మంది బరిలో ఉన్నారు.

    పోటీలో ప్రముఖులు..
    ఐదో విడత పోలింగ్‌లో కేంద్రం మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు.

    రాష్ట్రాల వారీగా ఎన్నికలు ఇలా..
    ఇక రాష్ట్రాల వారీగా పోలింగ్‌ జరిగే స్థానాలను పరిశీలిస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 1, లద్దాక్‌లో 1 స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. ఐదో దశతో కలిపితే ఇప్పటి వరకు 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.

    రాయబరేలీ, అమేథీలపై అందరి దృష్టి..
    ఐదో విడత ఎన్నికలు జరిగే రాయబరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌ కంచుకోటలు. అయితే ఐదేళ్ల క్రితం అమేథీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి కంచుకోటను బద్దలు కొట్టారు. ప్రస్తుతం రాహుల్‌ రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. స్మృతిపై గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కిశోరిలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. ఇక లఖన్‌వూలో హ్యాట్రిక్‌ విజయంపై రాజనాథ్‌సింగ్‌ గురిపెట్టారు.

    బారాముల్లాలో శతాధిక వృద్ధ ఓటర్లు..
    ఇదిలా ఉంటే.. ఐదో విడతలో ఎన్నికలు జరిగే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్ల లోక్సభ నియోజకవర్గంలో 17.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందలో శతాధిక వృద్ధులు 500 మందికిపైగా ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది పోటీలో ఉన్నారు. వారిలో 14 మంది స్వతంత్రులే. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ నుంచి గట్టి సవాల్‌ ఎదురవుతోంది.