RR Vs CSK IPL 2023: ఎంత బలమైన జట్టునైనా సునాయాసంగా ఓడించగల సామర్థ్యం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో పాటు మాస్టర్ మైండ్ ధోని సారధ్యం వహిస్తుండడంతో ఈ జట్టు ప్రతి సీజన్లోనూ బలంగానే బరిలోకి దిగుతోంది. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైనదైనా.. ధోని వ్యూహాల ముందు చిత్తు కావాల్సిందే. అయితే అటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కు మింగుడు పడని జట్టు ఏదైనా ఐపిఎల్ లో ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్స్ మాత్రమే. రాజస్థాన్ జట్టును ఓడించడం చెన్నై జట్టుకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఈ జట్టు చేతిలో ప్రతిసారి చెన్నై బోల్తా పడుతుండడం గమనార్హం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని జట్లకు మింగుడు పడని జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం మింగుడు పడని ఒకే ఒక్క జట్టు రాజస్థాన్ రాయల్స్. ఈ జట్టుపై విజయాలు సాధించలేక చెన్నై సూపర్ కింగ్స్ ఆపసోపాలు పడుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు అదరగొడుతోంది. ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో మరోసారి కప్ గెలిచి ధోని కి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని జట్టు భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రదర్శన చేస్తోంది.
రెండుసార్లు ఓటమి చవిచూసిన చెన్నై జట్టు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొడుతోంది. అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం దెబ్బలు తింటోంది. ఇంకా చెప్పాలంటే ఈ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి తలనొప్పిగా మారిపోయింది. సీజన్ లో రెండుసార్లు ఇప్పటివరకు తలపడితే.. మ్యాచ్ ల్లోనూ చెన్నై జట్టు ఓడిపోయింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న చెన్నై జట్టు రాజస్థాన్ చేతుల్లో వరుసగా ఎందుకు ఓటమిపాలవుతుందో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటివరకు నాలుగు సార్లు విజేతగా నిలిచిన చెన్నై..
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు నాలుగు సార్లు చెన్నై జట్టు కప్పు కైవసం చేసుకుంది. 2020 మినహా ప్రతి సీజన్లోనూ క్వాలిఫైయర్స్ కు అర్హత సాధించింది ఈ జట్టు. దీనిని బట్టి చెన్నై జట్టు ఎంత బలంగా ఉంటుందో, ఎంత ప్రణాళిక ప్రకారం ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ లో ఆడే ప్రతి జట్టుపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించే ఈ జట్టు.. ఒక జట్టుతో మ్యాచ్ అంటే మాత్రం తడబడిపోతుంది. అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇప్పటివరకు ఈ జట్ల మధ్య ఏడుసార్లు మ్యాచులు జరగగా, చెన్నై జట్టు ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ పై మాత్రమే చెన్నై జట్టు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించేది.. కానీ ఇప్పుడు రాజస్థాన్ జట్టు అంటే ఒక రకంగా భయపడుతున్నట్లే కనిపిస్తోంది చెన్నై జట్టు పరిస్థితి.
బౌలింగ్ విభాగంలో తేలిపోతుండడంతోనే సమస్య..
చెన్నై జట్టు ఓడిపోవడానికి పోలింగ్ విభాగం తేలిపోవడమే కారణంగా కనిపిస్తోంది. చెన్నై బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. అలాగే, అన్ని జట్లపై స్పిన్ బౌలింగ్ తో ముప్పేట దాడి చేసే చెన్నై జట్టు.. రాజస్థాన్ తో మ్యాచ్ అంటే మాత్రం అదే స్పిన్ బౌలింగ్ తో ఇబ్బంది పడుతోంది చెన్నై జట్టు. రాజస్థాన్ జట్టులోని కీలక స్పిన్నర్లు అశ్విన్, చాహల్.. ధోని సేనను తికమక పెట్టేస్తున్నారు. అసలు పరుగులే చేయకుండా కట్టడి చేస్తూ.. కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన మ్యాచ్ లోను ఇటువంటి పరిస్థితే ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. చేదనలో చెన్నై వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. దీంతో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 32 పరుగులు తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. రాజస్థాన్ స్పిన్నర్లతో జాగ్రత్తగా ఉండాలని చెన్నై జట్టుకు గత మ్యాచ్ లోనే అర్థమైంది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే రిపీట్ అయింది. దీనిని బట్టి చూస్తుంటే చెన్నై తెలిసే తప్పు చేస్తుందా అనిపిస్తోంది. మళ్లీ ఇలా జరగకూడదు అనుకుంటే చెన్నై జట్టు స్పిన్ విషయంలో మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.