Joe Root : జో రూట్ ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ చేసి.. అనేక రికార్డులను గల్లంతు చేశాడు. 167 బంతుల్లో జో రూట్ మూడంకెల స్కోర్ సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రూట్ కు ఇది 35వ సెంచరీ. స్థూలంగా ఈ ఏడాది ఐదవ సెంచరీ. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా శతకాలు చేసిన ఆరవ ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్ వంటి వారి రికార్డులను అధిగమించాడు. టెస్టులలో గవాస్కర్, లారా, యూనిస్ ఖాన్ తలా 34 సెంచరీలు చేశారు. ఇక ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 51, కలిస్ 45, పాంటింగ్ 41, సంగక్కర 38, రాహుల్ ద్రావిడ్ 36 సెంచరీలతో రూట్ కంటే ముందున్నారు. రూట్ జోరు చూస్తుంటే సంగక్కర, ద్రావిడ్ రికార్డులు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది..
ఒకే క్యాలెండర్ ఇయర్లో..
రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో 5 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు కలిస్, స్టీవ్ స్మిత్ రికార్డును సమన్ చేశాడు.. ఈ జాబితాలో మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ (నాలుగుసార్లు) కొనసాగుతున్నారు. రూట్, స్మిత్, కలిసి మూడు సార్లు 5+ శతకాలు బాదారు. రూట్ 2021, 2022, 2024 లో ఈ రికార్డును సృష్టించాడు. 2013 నుంచి 2020 వరకు రూట్ టెస్ట్ క్రికెట్లో 17 సెంచరీలు మాత్రమే చేశాడు. గడచిన మూడు సంవత్సరాలలో ఏకంగా అతడు 18 సెంచరీలు చేయడం విశేషం. ఇక టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రూట్ ఘనత సాధించాడు. అంతకుముందు అలిస్టర్ కుక్ పేరుమీద రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున కుక్ 161 టెస్ట్ లలో 45.35 సగటుతో 12,472 రన్స్ చేశాడు. అయితే ఈ రికార్డును రూట్ 147 టెస్టులలోనే అధిగమించడం విశేషం. రూట్ 50 కంటే ఎక్కువ సగటుతో 12,473 కు పైగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అత్యధికంగా పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. రూట్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను గల్లంతు చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు..రూట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.. గత రికార్డులు గల్లంతవుతాయని వారు జోస్యం చెబుతున్నారు.