ENG vs SL : ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో రూట్ మరో ఘనతను సృష్టించాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. సుదీర్ఘ క్రికెట్ చరిత్ర లో అత్యధికంగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు ఏకంగా 15921 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెంతకి పాంటింగ్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతడు 13,378 పరుగులు చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కలిస్ మూడవ స్థానంలో ఉన్నాడు. అతడు 13,289 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో టీమిండియా గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ఇతడు 13,288 పరుగులు చేశాడు. తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ ఉన్నాడు. ఇతడు 12,472 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న రూట్.. కుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఇతడు ఏకంగా 12, 402 పరుగులు చేశాడు. రూట్ తర్వాతి స్థానంలో సంగక్కర ఉన్నాడు. ఇతడు 12,400 చేశాడు. ప్రస్తుతం ఉన్న ఫాం ప్రకారం చూసుకుంటే రూట్ మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. అతడు సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న నేపథ్యంలో రెండవ స్థానానికి చేరుకోవడం ఖాయమని క్రీడా పండితులు చెప్తున్నారు. మరోవైపు వచ్చే అక్టోబర్లో పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ సమయంలో కుక్ రికార్డును రూట్ బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇంగ్లాండ్ జట్టు అక్టోబర్ నెలలో పాకిస్తాన్ జట్టుతో మూడు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో మరో మూడు టెస్టులలో తలపడుతుంది.
విజయం వైపుగా శ్రీలంక
ఇక శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్ట్ లో కూడా శ్రీలంక విజయం వైపుగా వెళ్తోంది. నాలుగు రోజు ఆట ప్రారంభమైన సమయానికి శ్రీలంక జట్టు రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. శ్రీలంక గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. ఓపెనర్ కరుణ రత్నే 8 పరుగులకే అవుట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ నిశాంక స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. అతడు 77 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. కుశాల్ మెండిస్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఏంజెలో మాథ్యూస్ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, అట్కిన్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
పేక మేడలా కూలిపోయింది
అంతకుముందు ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. శ్రీలంక కెప్టెన్ ధనుంజయ 69, మెండిస్ 64.. పరుగులు చేసినప్పటికీ.. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔట్ కావడం శ్రీలంక జట్టును ఇబ్బందికి గురిచేసింది. ఇక మిగతా ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో శ్రీలంక 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 156 పరుగులకే చాప చుట్టింది. రూట్ 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ..కుక్ రికార్డుకు చేరువగా వచ్చాడు. సంగక్కర ఘనతను అధిగమించాడు. అతడు వికెట్ కీపర్ స్మిత్ 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక జట్టులో కుమార 4 వికెట్లు పడగొట్టాడు. విశ్వ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులు చేసింది. కెప్టెన్ పోప్ 154 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఈ జోరు కొనసాగించలేకపోయింది. మైదానంపై ఉన్న తేమను శ్రీలంక బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. వెంట వెంటనే వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. వికెట్ కీపర్ స్మిత్ కనుక నిలబడకపోయి ఉంటే ఇంగ్లాండ్ జట్టు 100 పరుగులకే ఆల్ అవుట్ అయ్యేది. మూడవ టెస్టులో అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ గెలవడం దాదాపు అసాధ్యం.