Rohith Sharma : ఈ టెస్ట్ సిరీస్ కు సంబంధించి భారత సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ఎంపిక చేసింది. అయితే సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించలేదు. కెప్టెన్సీ రేసు నుంచి రోహిత్ శర్మను పక్కన పెట్టారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ వెంటనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. అదే కాదు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు..దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ లో దేశానికి నాయకత్వం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ వెల్లడించాడు.
38 సంవత్సరాల వయసులో..
రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. 2013లో టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాలోకి అతడు ప్రవేశించాడు.. 67 మ్యాచ్లు ఆడాడు. 4,301 రన్స్ చేశాడు. సుదీర్ఘ ఫార్మెట్లో అతడు 12 సెంచరీలు చేశాడు. 18 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ గత ఏడాది టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. అతడు సారధ్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రెండవసారి పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. ఇక రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా రెండుసార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే రెండుసార్లు కూడా ఫైనల్ లో భారత్ ఓడిపోయింది. ఒకసారి న్యూజిలాండ్ చేతిలో.. మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇక తాజా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో గెలవాల్సిన టెస్ట్ సిరీస్లలో భారత్ ప్రత్యర్థి జట్ల ఎదుట తలవంచింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టులను ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియాతోనూ అదే తీరుగా సిరీస్ కోల్పోయింది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లకుండా ఇంటికి వచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. చివరికి సిడ్ని టెస్టులో అతడు కెప్టెన్సికి దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ భారత్ విజయం సాధించలేకపోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. రోహిత్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం.. ఎరుపు రంగు బంతి ఫార్మాట్లో రోహిత్ దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో భారత్ దాని ఫలితాలను అనుభవించింది. చివరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కోల్పోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం రోహిత్ టెస్ట్ కెరియర్ లో మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఈ రెండు టెస్ట్ సిరీస్లలో భారత్ ఓడిపోవడంతో చివరికి రోహిత్ తన టెస్ట్ కెరియర్ కే గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.