ICC Champions Trophy : రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నప్పటికీ.. లేకపోయినప్పటికీ జట్టును మాత్రం బలంగా నడిపిస్తాడు. ఏకతాటిపై ఉండేలా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మినహా.. మిగతా అన్ని విషయాల్లోనూ జట్టును సమర్థవంతంగా నిలుపుతాడు. అందువల్లే అతని ఆధ్వర్యంలో టీమిండియా ఐసీసీ టోర్నమెంట్ లలో గడచిన 21 మ్యాచ్లలో ఒకే ఒక్క ఓటమిని ఎదుర్కొంది. అది కూడా ఆస్ట్రేలియా చేతిలో.. దీనినిబట్టి రోహిత్ స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి రికార్డ్ టీమిండియాలో ఇంతవరకు ఏ కెప్టెన్ కూడా సాధించలేదు. అంతటి సచిన్ టెండుల్కర్ కు కూడా సాధ్యం కాలేదు.
రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా కెప్టెన్ గా సూపర్ రికార్డ్ కలిగి ఉన్నాడు. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా గత ఐదు ఐసిసి ట్రోఫీలలో సెమీఫైనల్ వెళ్ళింది. 2022 t20 వరల్డ్ కప్ లో సెమిస్ చేరుకొంది. అయితే ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2021 – 23 సీజన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వెళ్ళింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. రన్నరప్ తో సరిపుచ్చుకుంది. ఇక 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించి, 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ ను రెండవసారి దక్కించుకుంది. 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్ మొదలు కాగా.. ఆ సీజన్లో టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. అప్పుడు టీమ్ ఇండియాకు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. నాటి జట్టులో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.
ఇప్పుడు టైటిల్ మనదేనా
ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ప్రారంభ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక న్యూజిలాండ్ జట్టుతో మూడవ లీగ్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది స్వదేశం వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ 0-3 వైట్ వాష్ కు గురైంది. ఆ ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించి దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో నాటు ఓటమికి బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా రెడీగా ఉంది. వన్డేలలో న్యూజిలాండ్ జట్టుపై టీమ్ ఇండియాకు మెరుగైన రికార్డు ఉంది. అయితే ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు పై భారత్ ఘనవిజయం సాధించింది. 300 కి పైగా పరుగులు చేసినప్పటికీ.. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎదురుదాడికి దిగడంతో.. భారత్ ఒకానొక దశలో ఇబ్బంది పడింది. ఆ తర్వాత పుంజుకుంది. న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో వేగంగా 20 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న అతడు తొలి వికెట్ కు మెరుగైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు. కెప్టెన్ గా మెరుగైన రికార్డు ఉన్న నేపథ్యంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ విజయం సాధించి జట్టుకు కప్ అందించాలని రోహిత్ భావిస్తున్నాడు. ఆటగాళ్లు కూడా సూపర్ ఫామ్ లో ఉండడం రోహిత్ శర్మకు కలిసి వచ్చే విషయం. పైగా గణాంకాలు కూడా రోహిత్ శర్మకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి.