Rohit Sharma: ముంబై జట్టుకు రోహిత్ ఆడడు.. అతని ప్రయాణం ఎప్పుడో ముగిసింది..: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో చాలామంది క్రికెటర్లు పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 8:18 am

Rohit Sharma(1)

Follow us on

Rohit Sharma: ఈసారి వేలానికి ముందే ముంబై జట్టు నుంచి రోహిత్ శర్మ వెళ్ళిపోతాడని ప్రచారం జరుగుతోంది. అతడు ఒకవేళ వేలంలోకి వస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే పలు మేనేజ్మెంట్లు ప్రకటించాయి. కొన్ని మేనేజ్మెంట్లయితే రోహిత్ కోసం 50 కోట్ల దాకా ఖర్చు చేసేందుకు వెనుకాడబోవని ఇటీవల స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే తాను ముంబై జట్టును విడిపోతానని.. వేలంలో పాల్గొంటారని రోహిత్ ఎప్పుడూ చెప్పలేదు. పైగా కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించినప్పటికీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కెప్టెన్సీ హార్థిక్ పాండ్యాకు ఇచ్చినప్పటికీ.. అతని నాయకత్వంలో రోహిత్ ఆడాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా తన సేవలు అందించాడు.

అయితే రోహిత్ ఐపీఎల్ ప్రయాణం పై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో రోహిత్ తన ప్రయాణాన్ని ముగించాలని పేర్కొన్నాడు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. ” ముంబై జట్టుతో కొనసాగడం రోహిత్ కు ఇష్టం లేదు. రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడతాడా? బయటకి వెళ్ళిపోతాడా? అనేది చిక్కు ప్రశ్న. నా వర్క్ అయితే అతడు ఆ జట్టుతో ఉండకూడని భావిస్తున్నాను. రోహిత్ ను మూడు సంవత్సరాల పాటు కొనసాగించగలిగితేనే రిటైన్ చేసుకునే అవకాశం ముంబై జట్టుకుంది. అయితే ఇది మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం వర్తించదు. చెన్నై జట్టు నేపథ్యం వేరు. ముంబై ఇండియన్స్ కథ వేరు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ వెళ్లిపోవచ్చు.. లేకుంటే ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ ను వదిలేసుకోవచ్చు. ఇలాంటి పరిణామాల మధ్య రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుతో ఉంటాడని నేను ఏమాత్రం అనుకోవడం లేదు. ఇలా చెప్పడానికి నా వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే ముంబై జట్టు మాత్రం అతడిని కచ్చితంగా వదిలేస్తుంది.. అలాంటప్పుడు జరిగే వేలంలో ఇతర జట్లు రోహిత్ శర్మను దర్జాగా కొనుగోలు చేసుకోవచ్చు.. ఇప్పటికైతే నేను ముంబై ఇండియన్స్ జట్టుతో రోహిత్ తన ప్రయాణాన్ని ముగించాడనే భావిస్తున్నానని” ఆకాష్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇటీవల ipl సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను పక్కన పెట్టింది. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. రోహిత్ ముంబై జట్టుకు 5 టైటిల్స్ అందించాడు. గుజరాత్ జట్టును 2022 లో విజేతగా నిలిపాడనే ఒకే ఒక కారణంతో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు గుజరాత్ టైటాన్స్ నుంచి బదిలీ చేసుకుంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై రోహిత్ శర్మ భార్య కూడా స్పందించింది.. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించడం ఇష్టం లేక అతని అభిమానులు హార్దిక్ పాండ్యా పై విమర్శలకు దిగారు.. మైదానంలో ముంబై జట్టు మ్యాచ్ ఆడుతుండగానే బహిరంగంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అప్పట్లో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి.