Rohit Sharma: ఇటీవల భారత్ ఇంగ్లాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ లు ఆడింది. ఈ రెండిట్లో ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుపై ఏకపక్షమైన ఆట తీరు ప్రదర్శించి రెండు సిరీస్ లు దక్కించుకుంది. టి20 లో సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav), వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్టుకు నాయకత్వం వహించారు. వరుసగా రెండు సిరీస్లలో విజయం సాధించడంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు నూతనోత్సాహాన్ని పెంపొందించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గత సీజన్లో భారత్ ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా తలవంచింది. గతంలో జరిగిన తప్పును ఈసారి పునరావృతం చేయొద్దని భారత జట్టు భావిస్తోంది.
రోహిత్ కు పెద్ద షాక్
అయితే త్వరలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోలుకోలేని షాక్ తగిలినట్టు తెలుస్తుంది. రోహిత్ శర్మ ఇకపై టెస్టులకు కెప్టెన్ గా బీసీసీఐ పరిగణలోకి తీసుకోదని PTI వర్గాలు చెబుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కొత్త WTC(world Test championship) మొదలవుతుంది. జూన్ – జూలై నెలలో ఇంగ్లాండ్ జట్టుతో ప్రారంభమయ్య టెస్ట్ సిరీస్ ద్వారా భారత్ WTC సీజన్ మొదలవుతుంది. అయితే ఆ సీజన్లో భారత జట్టుకు జస్ ప్రీత్ బుమ్రా (Jaspreet bumrah) నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్లో బుమ్రా వెన్నునొప్పికి గురయ్యాడు. అందువల్లే ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో అతడిని ఎంపిక చేయలేదు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ దూరంగా ఉంచారు. స్కానింగ్ రిపోర్టులో ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ వర్గాలు పంపించాయి. అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో పెర్త్ లో జరిగిన టెస్టులో బుమ్రా నే భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కావడంతో ఆ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అయితే జట్టును నడిపించిన విధానం బాగుండడం వల్లే బుమ్రాకు కెప్టెన్సీ అప్పగిస్తారని PTI వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయం అధికారికంగా బీసీసీఐ ప్రకటించలేదు కాబట్టి.. నిరాధారమని రోహిత్ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ” రోహిత్ ఇంకా చాలా సంవత్సరాలు పాటు టెస్ట్ క్రికెట్ ఆడతాడు. ఇటీవల సూపర్ సెంచరీతో తిరుగులేని ఫామ్ లోకి వచ్చాడు. అటువంటి ఆటగాడిని పక్కన ఎలా పెడతారు? అతడు కెప్టెన్ గా ఉంటేనే భారత జట్టు విజయాలు సాధిస్తుంది.. ఒక్కసారి రోహిత్ ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయొద్దని” రోహిత్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.