Visakhapatnam Metro: సాగరనగరం పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖ( Visakhapatnam) నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐటి హబ్ గా మార్చాలని భావిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యింది. మరోవైపు విశాఖలో ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. డబుల్ డెక్కర్ తరహాలో ప్రభుత్వం భూసేకరణకు అడుగులు వేస్తోంది. మొదటి దశలో మూడు క్యారిడార్లలోని 46.23 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించి విశాఖ కలెక్టరేట్ కు వివరాలను పంపించారు. దీంతో విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి ముందడుగు పడినట్లు అయ్యింది.
* ఈ మూడు మార్గాల్లో
మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా స్టీల్ ప్లాంట్( steel plant) నుంచి కొమ్మాది వరకు 34.40 కిలోమీటర్ల మెట్రో రైల్ ఏర్పాటు చేయనున్నారు. వీటి మధ్య 29 స్టేషన్లు ఉండనున్నాయి. తాటి చెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఉండనుంది. మొత్తం ఏడు స్టేషన్లు ఉండనున్నాయి. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఉండనుంది. ఆరు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గాల్లో ఎక్కడ భూమి అవసరము విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో భూములను గుర్తించేందుకు సర్వే చేయనున్నారు. ఈ భూ సేకరణ కోసం డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో.. డిప్యూటీ తహసిల్దార్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో ఈ బృందం సర్వే ప్రారంభించనుంది.
* ప్రభుత్వ భూమి ఉండేలా చర్యలు
విశాఖ మెట్రో రైల్వే ప్రాజెక్టుకు( Visakha metro railway project ) సంబంధించి భూ సేకరణలో ప్రభుత్వ భూమి ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతంలో మాత్రం ప్రైవేటు స్థలం అవసరం. అక్కడ ప్రైవేట్ స్థలాన్ని సేకరించనున్నారు. విశాఖ రూరల్, గాజువాక, మహారాణి పేట, సీతమ్మధార మండలాల పరిధిలో 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మండలాల పరిధిలో ప్రైవేటు స్థలం అవసరం అవుతుంది అని భావిస్తున్నారు. మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వివరాల మేరకు భూమిని సేకరిస్తామని చెబుతున్నారు అధికారులు.
* ప్రభుత్వ భూములు అధికం
విశాఖ నగరంలో ( Visakhapatnam City)కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూమి కూడా ఉంది. అది కూడా మెట్రో రైల్ ఏర్పాటుకు అవసరం కానుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. తొలి దశలో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 47.75 ఎకరాల భూమి కూడా అవసరం. కోర్టుకు చెందిన 36 ఎకరాలు, రైల్వే భూమి నాలుగు ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి మూడు ఎకరాలు అవసరం ఉంది. ఇంకోవైపు ప్రైవేటు భూమి 9 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ సర్వే తర్వాత రానుంది. మొత్తానికైతే విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు అడుగులు పడుతుండడం శుభపరిణామం.