Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 241పరుగులకు ఆలౌట్ అయింది. 242పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి భారత్ నిలకడగా పరుగులు రాబడుతోంది. ఈ క్రమంలోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక ఘనతను సాధించాడు. రోహిత్ 2013 సంవత్సరంలో రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడడం ప్రారంభించాడు. అప్పటి నుండి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రికార్డులను నెలకొల్పాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే తను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ కొత్త ప్రపంచ రికార్డు
పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఖాతా తెరిచిన వెంటనే రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్‌గా 9000 పరుగులు పూర్తి చేశాడు. అతను వన్డే క్రికెట్‌లో కేవలం 181 ఇన్నింగ్స్‌లలో 9000 పరుగుల మార్కును దాటాడు. ఇది అత్యంత వేగవంతంగా ఈ సంఖ్యను సాధించడం ఓ కొత్త ప్రపంచ రికార్డు. అంతకుముందు, ఈ రికార్డు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతను 197 ఇన్నింగ్స్‌లలో 9000 పరుగులు సాధించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టి తన సొంతం చేసుకున్నాడు.
ఈ దిగ్గజాలు కూడా వెనుకనే
సచిన్ తో పాటు, రోహిత్ శర్మ సౌరవ్ గంగూలీ, క్రిస్ గేల్, ఆడమ్ గిల్ క్రిస్ట్, సనత్ జయసూర్య వంటి దిగ్గజ ఓపెనర్లను కూడా వెనక్కి నెట్టాడు. వన్డేల్లో ఓపెనర్‌గా 9000 పరుగులు చేరుకోవడానికి, సౌరవ్ గంగూలీ 231 ఇన్నింగ్స్‌లు, క్రిస్ గేల్ 246 ఇన్నింగ్స్‌లు, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 253 ఇన్నింగ్స్‌లు, సనత్ జయసూర్య 268 ఇన్నింగ్స్‌లు ఆడారు. వన్డే క్రికెట్‌లో పరుగులు సాధించాలనే ఒత్తిడి బాగా పెరిగిన సమయంలో రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పెద్దగా ఆడలేకపోయాడు. అతను 15 బంతులు ఎదుర్కొని 133.33 స్ట్రైక్ రేట్‌తో 20 పరుగులు చేశాడు. ఈ సమయంలో తను 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. షాహీన్ అఫ్రిది తనను క్లీన్ బౌల్డ్ చేశాడు.