Rohit Sharma: ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ గా కాకుండా.. సాధారణ ఆటగాడిగా ఆ జట్టులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆడుతున్నాడు.. హార్దిక్ పాండ్యా నాయకత్వ లోపం వల్ల ముంబై జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచులు మాత్రమే గెలిచింది. పాయింట్లు పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు ఒక సెంచరీ సహాయంతో ఆరు మ్యాచులు ఆడి 261 పరుగులు చేశాడు.. ఐపీఎల్ వల్ల తీరికలేకుండా ఉన్న రోహిత్ శర్మ.. ఆట నుంచి కొంత విరామం లభించగానే “క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్ కాస్ట్ లో భాగంగా మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్ క్రిస్ట్ తో సరదాగా సంభాషించాడు.
ఈ సందర్భంగా ఐపిఎల్ 2024లో చెన్నై జట్టు తరఫున ఆఖరిలో వచ్చి సిక్సర్ల వర్షం కురిపిస్తున్న మహేంద్రసింగ్ ధోని గురించి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు..”త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ధోని ఒప్పించడం చాలా కష్టం. ఇప్పటికే అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయసు వల్ల అలసిపోయాడు. అయితే అతడు అమెరికాకు రావడం అయితే ఖాయమే.. కాకపోతే అక్కడికి వచ్చి గోల్ఫ్ ఆడతాడు. ఇటీవల కాలంలో ధోని గోల్ఫ్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు” అంటూ రోహిత్ వివరించాడు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని చివరి 4 బంతుల్లో 20 పరుగులు సాధించిన తీరు అమోఘమని రోహిత్ శర్మ కొనియాడాడు. ధోనితో పోల్చితే దినేష్ కార్తీక్ ను వరల్డ్ కప్ లో ఆడేందుకు సులువుగా ఒప్పించవచ్చని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తుండగా.. రోహిత్ శర్మ సరదాగా ఆటపట్టించాడు. టి20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యేందుకే కదా ఈ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడుతున్నావు అంటూ టీజ్ చేశాడు.
ఇక రిషబ్ పంత్ గురించి ప్రస్తావిస్తూ..”నేను ఎప్పుడైనా ముభావంగా ఉంటే అతడు తన మాటలతో నవ్విస్తాడు.. రోడ్డు ప్రమాదం వల్ల ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. కీపర్, బ్యాటర్ గా అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకొని అద్భుతంగా ఆడుతున్నాడంటూ ” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జూన్ 1 నుంచి అమెరికా – వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5న టీమిండియా తన తొలి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో ఆడబోయే జట్టుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిషబ్ పంత్ గురించి సుదీర్ఘంగా రోహిత్ శర్మ మాట్లాడిన నేపథ్యంలో.. అతడే టి20 వరల్డ్ కప్ లో కీపర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.