Rohit Sharma: అతడు మైదానంలోకి దిగితే ఎంతటి తోపు బౌలర్ అయిన సైలెంట్ కావాల్సిందే. ఫోర్లు, సిక్స్ లు వెళ్తుంటే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండి పోవాల్సిందే. సింహం వేటాడినట్టు ఉండే అతడి బ్యాటింగ్ .. ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నం. కానీ అలాంటి ఆటగాడు ఈ ఐపీఎల్ సీజన్ లో తేలిపోతున్నాడు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోతున్నాడు. దీంతో టి20 వరల్డ్ కప్ ముందు అతడు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సందేహాలు మొదలయ్యాయి.
రోహిత్ శర్మ.. ముంబై జట్టు కీలక ఆటగాడు మాత్రమే కాదు.. టీమిండియా కు కెప్టెన్ కూడా.. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ కూ అతడే నాయకుడు. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో భారత్ తన తొలి టి20 మ్యాచ్ ఆడుతుంది. గత టి20 కప్ లో భారత్ సెమీఫైనల్ లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
అదే అలాంటి పట్టుదలతో ఉన్న జట్టును నడిపించే నాయకుడు రోహిత్ శర్మ సరిగ్గా ఆడటం లేదు. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా.. కారణాలను సాకుగా చూపి ఆటగాడి ఫామ్ లేమిని మరుగున పెట్టడం సాధ్యం కాదు.. సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ (4) దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ లో నిర్లక్ష్యపు షాట్ ఆడి, క్యాచ్ ఔట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కావడం ఇది నాల్గవసారి.
ఐపీఎల్ సీజన్ ఫస్ట్ ఆఫ్ లో రోహిత్ పర్వాలేదు అనిపించాడు. తొలి ఏడు ఇన్నింగ్స్ లలో 297 రన్స్ చేశాడు. కానీ, ఆ తర్వాత ఇది ఇన్నింగ్స్ లలో కేవలం 34 రన్స్ మాత్రమే చేశాడు. వాస్తవానికి రోహిత్ శర్మ ఎప్పుడూ ఇలాంటి ఆటతీరు ప్రదర్శించలేదు. రోహిత్ పేలవమైన ఫామ్ పట్ల సీనియర్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.”అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ ముందు అతడి ఫామ్ ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ సీజన్ ఫస్ట్ ఆఫ్ లో 297 రన్స్ చేశాడు. చివరి ఐదు ఇన్నింగ్స్ లలో 34 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తన పూర్వపు లయను అందుకోవాల్సిన అవసరం ఉందని” ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విట్ చేశాడు.
రోహిత్ ఆట తీరు పట్ల విమర్శకులు మాత్రమే కాదు అతడి అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సుదీర్ఘ కెరియర్లో చివరి t20 వరల్డ్ కప్ ఆడుతున్న రోహిత్.. తన మునుపటి ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే రోహిత్ శర్మ టీం ఇండియా కెప్టెన్ కాకుంటే.. అతడిని టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసే వారు కాదని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రోహిత్ తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకుంటాడో, లేదో, చూడాల్సి ఉంది.