Karimnagar: వ్యసనం ఏడూళ్ల ప్రయాణం అంటారు. అలాంటి వ్యసనాల బారిన పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. కొంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటే.. మరి కొంతమంది తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నారు. ఈ జాబితాలో మరో యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేరాడు. ఆన్ లైన్ జూదానికి అలవాటు పడి.. చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు.
కరీంనగర్ జిల్లా గంగాధర లోని మధురానగర్ కు చెందిన నాగుల లక్ష్మణ్, లక్ష్మీ దంపతులకు కుమారుడు పృథ్వీ(25) ఉన్నాడు. ఇతడు బీటెక్ పూర్తి చేశాడు. గత ఏడాది హైదరాబాదులో ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు. విధుల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉండేవాడు.
ఈ క్రమంలో ఆన్ లైన్ లో అతడికి ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. అలా వారు అతడిని ఆన్ లైన్ జూదంలోకి లాగారు. రెట్టింపు డబ్బు వస్తుందని ఆశ పెట్టి అతనితో జూదం ఆడించారు. డబ్బులు వస్తాయనే ఆశతో అతడు అప్పులు చేశాడు. స్నేహితుల వద్ద వివిధ కారణాలు చెప్పి 12 లక్షల దాకా అప్పు చేశాడు. ఆ డబ్బు మొత్తం కేవలం నాలుగు రోజుల్లోనే పోగొట్టుకున్నాడు. ఈ మనో వేదనతో గత 15 రోజులుగా అతడు ఉద్యోగానికి కూడా వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు . అప్పులు చెల్లించే దారి లేక.. శనివారం రాత్రి తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తోటి స్నేహితులు గమనించి ఆ సమాచారాన్ని అతడి తల్లిదండ్రులకు అందించారు. ఈలోగా పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.