Rohit Sharma : క్రికెట్ లో ఒక బ్యాటర్ భారీ స్కోరు సాధించాడంటే కచ్చితంగా అన్ని పరిస్థితులు అతడికి అనుకూలించాలి. మైదానం నుంచి మొదలు పెడితే బౌలింగ్ వేసే బౌలర్ వరకు ఇలా చాలా అంశాలు ఒక బ్యాటర్ చేసే స్కోర్ ను నిర్దేశిస్తాయి. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో అవేవీ పనికిరావు. ఎందుకంటే అతడు ఎలాగైనా బ్యాటింగ్ చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఎలాంటి మైదానంపై నైనా బ్యాటింగ్ చేయగలడు.. అందుకే అతడిని రోహిట్ మాన్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. తొలి వన్డేలో 47 బాల్స్ లో 58, రెండవ వన్డేలో 44 బాల్స్ లో 64 రన్స్ చేసి రోహిత్ అదరగొట్టాడు.. వాస్తవానికి తొలి మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్లో భారత్ గెలుపునకు దగ్గరగా వెళ్లి.. చివరగా ఒక పరుగు చేయాల్సిన సమయంలో అర్ష్ దీప్ సింగ్ ఔట్ కావడంతో.. మ్యాచ్ టై అయింది. ఇక రెండో వన్డేలో శ్రీలంక విధించిన 241 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రోహిత్ శర్మ మరోసారి మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు.. ఏకంగా 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. కొలంబోలోనే ప్రేమ దాస మైదానం నిర్జీవంగా ఉన్నప్పటికీ రోహిత్ ఈ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడడం విశేషం. మిగతా భారత్ బ్యాటర్లు (అక్షర్ పటేల్ మినహా) విఫలమైనప్పటికీ.. రోహిత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తనకు మాత్రమే సొంతమైన షాట్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మైదానాన్ని హోరెత్తించాడు. వాస్తవానికి రోహిత్ వేసిన పునాదిని పటిష్టం చేయడంలో మిడిల్ ఆర్డర్ విఫలం కావడం వల్లే టీమిండియా తొలి మ్యాచ్ టై చేసుకుంది. రెండవ మ్యాచ్ ఓడిపోయింది.
వ్యతిరేక ఫలితం వచ్చినప్పటికీ
తొలి రెండు వన్డేలలో టీమిండియా కు వ్యతిరేక ఫలితం వచ్చినప్పటికీ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను సృష్టించాడు. అత్యధికంగా 50+ పరుగులు సాధించిన భారత జట్టు ఓపెనర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ఈ హాఫ్ సెంచరీ రోహిత్ శర్మ కి 121వ 50+ స్కోర్. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.. సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్ గా 120 సార్లు 50 ప్లస్ పరుగులు చేశాడు. రెండవ వన్డేలో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అనేక రికార్డులను తన పేరు మీద రాసేసుకున్నాడు.
గత ఏడాది జనవరి నెల నుంచి ఇప్పటివరకు వన్డే క్రికెట్లో తొలి 10 ఓవర్లలో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు రోహిత్ 53 సిక్స్ లు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 24 సిక్స్ లు రోహిత్ తర్వాత స్థానంలో ఉన్నాడు. 22 సిక్స్ లతో మహమ్మద్ వసిమ్, క్వింటన్ డికాక్ 15 సిక్స్ లతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.. మరోవైపు వన్డే క్రికెట్లో తొలి 10 ఓవర్లలోనే అత్యధిక అర్థ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండవ స్థానంలో ఉన్నాడు. టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 7 అర్థ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. నాలుగు అర్థ సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కో అర్థ సెంచరీలతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక రోహిత్ గత 12 ఇన్నింగ్స్ లలో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి. 131 (84), 86 (63), 48 (40), 46 (40), 87 (101), 4(2), 40(24), 61(54), 47(29), 47(31), 58(47), 64(44) గత 12 ఇన్నింగ్స్ లలో రోహిత్ పై తీరుగా పరుగులు చేశాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More