https://oktelugu.com/

Rohit Sharma : స్టార్ స్పోర్ట్స్ ను ఏకిపడేసిన రోహిత్.. నెటిజన్లు నుంచి భారీ ట్రోలింగ్..

టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా పరిధి దాటుతోందని మండిపడుతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదని.. హద్దుల్లో ఉంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 / 10:18 PM IST

    Rohit Sharma has criticized the style of Star Sports

    Follow us on

    Rohit Sharma : ఒకప్పుడు మైదానంలో ఆటగాళ్లు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నా.. బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసేది కావు. అప్పట్లో మీడియా విస్తృతి ఇంతగా లేకపోవడంతో ఆటగాళ్లు మాట్లాడుకున్న మాటలు అంతగా వ్యాప్తిలో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మీడియా రీచ్ పెరిగింది. సోషల్ మీడియా వినియోగం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో చీమ చిటుక్కుమన్నా.. ఆటగాళ్ల నోటి నుంచి ఎటువంటి మాట వినిపించినా అది వైరల్ అయిపోతోంది. పైగా ఆ విషయం లైవ్ లో బయటికి వస్తుండడంతో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మాటల్లో చెప్పాడు. అంతేకాదు మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇటువంటి పనులు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    ఇటీవల రోహిత్ శర్మ కోల్ కతా జట్టు కోచ్ అభిషేక నాయర్ తో మైదానంలో సంభాషణ జరిపాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై జట్టుతో తన ప్రయాణం గురించి రోహిత్ శర్మ ఆ సందర్భంగా నాయర్ తో పంచుకున్నాడు. ” సోదరా.. నాదేముంది.. ఇదే చివరిది” రోహిత్ అన్నట్టుగా ఆ వీడియోలో వినిపించింది. ఈ వీడియోతో రోహిత్ ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడని పుకార్లు షికార్లు చేశాయి. ఆ వీడియో కోల్ కతా తన అధికారిక సామాజిక మాధ్యమా ఖాతాల నుంచి తొలగించినప్పటికీ.. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారం పట్ల రోహిత్ మౌనాన్ని ఆశ్రయించడం పట్ల.. రోహిత్ గుడ్ బై చెప్తాడనే వాదనలకు బలం చేకూరింది.

    ఇక ఇటీవల లక్నో జట్టుతో ముంబై చివరి మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణితో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆ సమయంలో వీడియో తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నించగా.. అభిషేక్ నాయర్ తో మాట్లాడిన మాటలు.. అవి వైరల్ గా మారిన సంగతి గుర్తుకు వచ్చి.. రోహిత్ శర్మ అప్రమత్తమయ్యాడు. వీడియో తీయొద్దని కెమెరామెన్ కు విజ్ఞప్తి చేశాడు..” బ్రదర్ ఆడియోను క్లోజ్ చెయ్. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి” అని రోహిత్ అన్నాడు. “ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మా మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇవ్వాలని ప్రసారం చేసింది. ఇలాంటి చర్యల వల్ల అభిమానులకు, ఆటగాళ్లకు మధ్య ఉన్న అనుబంధాలు నాశనమవుతాయి. మీడియా ఒక విస్తృతిలో ఉంటే బాగుంటుంది. అలాగని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని” రోహిత్ వ్యాఖ్యానించాడు. రోహిత్ ట్విట్టర్లో స్టార్ స్పోర్ట్స్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. దీంతో నెటిజన్లు స్టార్ స్పోర్ట్స్ ను ఏకిపడేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా పరిధి దాటుతోందని మండిపడుతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదని.. హద్దుల్లో ఉంటే మంచిదని హితవు పలుకుతున్నారు.