Rohit Sharma: రోహిత్ శర్మ.. మైదానంలోకి వచ్చాడంటే చాలు.. ఆడేది వన్డే, టెస్ట్, టీ 20.. ఇలా ఏ ఫార్మాట్ అయినా దూకుడే మంత్రంగా సాగిపోతాడు. సిక్స్, ఫోర్లు మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేస్తాడు. అందుకే అతడిని హిట్ మాన్ అని పిలుస్తుంటారు. వన్డేలలో డబుల్ సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 లలోనూ అదే స్థాయిలో ఆడి అలరించాడు. టెస్ట్ మ్యాచ్ లోనూ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి.. సిసలైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మరెన్నో ఘనతలను తన సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మ తన పాత ఫామ్ కొనసాగిస్తున్నాడు. మారింది వేదికే కాని.. తన బ్యాటింగ్ కాదని నిరూపిస్తున్నాడు. బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
ఈ సిక్సర్లతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లో కలిపి 600 సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ 499 ఇన్నింగ్స్ లు ఆడి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతడి తర్వాత క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ అన్ని ఫార్మాట్లో కలిపి 551 ఇన్నింగ్స్ లలో 553 సిక్సర్లు కొట్టాడు.. గేల్ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఉన్నాడు.. ఇతడు 508 ఇన్నింగ్స్ లలో 476 సిక్సర్లు కొట్టాడు. బుధవారం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు సిక్సులు కొట్టడం ద్వారా.. రోహిత్ శర్మ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఇక రోహిత్ శర్మ ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. 2009లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత జట్టు ఐర్లాండ్ లో పర్యటించింది. ఆ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 52 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత అదే ఐర్లాండ్ జట్టుపై రోహిత్ శర్మ ఆడాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ 52 పరుగులు చేశాడు.. అయితే చివరికి రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు.
Aaj bhi kuch nahi badla!#INDvIRE #T20WorldCup #RohitSharma pic.twitter.com/MjFVlDBh9J
— Punjab Kings (@PunjabKingsIPL) June 5, 2024