David Warner: గేల్, విరాట్ కోహ్లీ రికార్డుల బద్దలు.. డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర

ఒమన్ పై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల టి20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఈ ఫార్మాట్లో వార్నర్ 111 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 4:59 pm

David Warner

Follow us on

David Warner: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో డేవిడ్ వార్నర్ తనవంతు పాత్ర పోషించాడు. ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టోయినిస్ దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 51 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఒమన్ బౌలర్లలో మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. ఒమన్ ఆటగాడు అయాన్ ఖాన్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఆస్ట్రేలియా బౌలర్ స్టోయినిస్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. స్టార్క్, ఎలీస్, జంపా తలా రెండు వికెట్లు పడగొట్టారు.. ఈ మైదానం బౌలింగ్ కు అనుకూలించడంతో ఒమన్ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో ఆస్ట్రేలియా 12 ఓవర్ల వరకు మూడు వికెట్లు కోల్పోయి 63 పరుగులు మాత్రమే చేసింది. ఆ దశలో స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 67 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.. మరో ఆటగాడు డేవిడ్ వార్నర్ 51 బంతుల్లో 56 పరుగులు చేశాడు.. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఆస్ట్రేలియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ఒమన్ పై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల టి20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఈ ఫార్మాట్లో వార్నర్ 111 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు గేల్ పేరు మీద ఉండేది. గేల్ 110 హాఫ్ సెంచరీలతో ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లీ 105, బాబర్ అజామ్ 101, జోస్ బట్లర్ 89 అర్ధ సెంచరీలతో మిగతా స్థానాల్లో కొనసాగుతున్నారు… అంతర్జాతీయ టి20 క్రికెట్లో వార్నర్ కు ఇది 27వ హాఫ్ సెంచరీ.. ఇది మాత్రమే కాదు, ఒమన్ పై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా వార్నర్ మరో రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తరఫున t20 లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. 3,155 పరుగులతో వార్నర్ మొదటి స్థానంలో ఉండగా, అరోన్ పించ్ 3,120, గ్లెన్ మాక్స్ వెల్ 2,468, షేన్ వాట్సన్ 1,462 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.