IND Vs BAN: బంగ్లాదేశ్ సిరీస్ కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై.. దాదాపు 22 నెలలు మంచానికి పరిమితమైన రిషబ్ పంత్ ఈ టోర్నీ ద్వారా టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బుమ్రా కూడా ఈ మ్యాచ్ లో కీలకమైన బౌలర్ గా మారనున్నాడు.. అయితే తొలిసారి భారత్ స్పిన్నర్లకు బదులు ముగ్గురు పేస్ బౌలర్లతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. ఎరుపు రంగు బంతితో సాధన మొదలుపెట్టారు.
చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. అతడు మరొక ఏడు సిక్స్ లు కొడితే భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు. ఇదే సమయంలో అతడు టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘనతను బద్దలు కొడతాడు.. వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టులు ఆడాడు. 178 ఇన్నింగ్స్ లలో 90 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ శర్మ 59 మ్యాచ్ లు ఆడాడు.. 101 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు అతడు 84 సిక్సర్లు కొట్టాడు. మరో ఏడు సిక్సర్లు కొడితే సెహ్వాగ్ ఘనతను అధిగమిస్తాడు. జాబితాలో 78 సిక్స్ లతో ధోని మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. 69 సిక్సులతో సచిన్ నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. 64 సిక్సులతో రవీంద్ర జడేజా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ధోని 90 టెస్టులు ఆడి.. 144 ఇన్నింగ్స్ లలో 78 సిక్సర్లు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్ లలో 69 సిక్సర్లు బాదాడు.. రవీంద్ర జడేజా 105 ఇన్నింగ్స్ లలో 64 సిక్సర్లు కొట్టాడు. అయితే బంగ్లాదేశ్ తో జరిగే టోర్నీలో రోహిత్ రికార్డును అధిగమించడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే అతడు ఇటీవల కాలం నుంచి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పైగా స్వదేశంలో.. తనకు అచ్చి వచ్చిన చెన్నై మైదానంలో రోహిత్ చెలరేగి ఆడటం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ శర్మ మైదానంలో వీరవిహారం చేస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇంకా సరికొత్త రికార్డులను సృష్టిస్తాడని స్పష్టం చేస్తున్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడని.. అతడు ఏదైనా చేస్తాడని పేర్కొంటున్నారు.