Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో ఈసారి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు.. యువ ఆటగాళ్లు కూడా పోటీపడ్డారు. అందులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, మరో యువ ఆటగాడు రింకూ సింగ్ కూడా ఉన్నారు. అయితే వీరికి అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీ వహిస్తున్న ఇండియా – బీ జట్టుకు ఆడుతున్నాడు. ఇండియా – సీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరచాడు.. ఇండియా – సీ జట్టు ఆల్ రౌండర్ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు నితీష్ రెడ్డి పై ఈ టోర్నీలో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. ఊహించని తీరుగా అవుట్ అవుతూ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక .. తన కెరియర్ ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండవ టెస్ట్ కు ఎంపికయ్యే అవకాశాలను క్లిష్టతరం చేసుకుంటున్నాడు.. నితీష్ కుమార్ రెడ్డి కనుక సమర్థవంతంగా ఆడితే బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్టు సిరీస్ కు అతడికి పిలుపు వచ్చేది. టెస్ట్ ఫార్మాట్లో ఆల్ రౌండర్ కోసం టీమిండియా ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఆ స్థానాన్ని నితీష్ కుమార్ రెడ్డితో భర్తీ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే అతన్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసింది. కానీ అతను మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు..
సీనియర్ ఆటగాళ్లు బంగ్లా తో జరిగే తొలి టెస్ట్ ఆడేందుకు చెన్నై వెళ్లిన నేపథ్యంలో రింకూ సింగ్ కు అవకాశం లభించింది. కానీ అతను కూడా నిరాశపరచాడు. 16 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి అన్షుల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి రింకు సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వాటిని అందుకోవడంలో అతడు దారుణంగా విఫలమయ్యాడు. టి20 క్రికెట్లో రింకు సింగ్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే దానిని టెస్ట్ క్రికెట్లోనూ కొనసాగించడంలో రింకు సింగ్ విఫలమవుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లో నిలబడలేక పోతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా ఇండియా సి జట్టు బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 525 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. మానవ సుతార్ 82 పరుగులు చేసి అలరించాడు. ఇండియా – బీ బౌలర్లలో ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా – బీ జట్టు మూడవరోజు ఆటో ముగిసే సమయానికి 7 వికెట్లకు 309 రన్స్ చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 143 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నారాయణ్ జగదీషన్ అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. అన్షుల్ కాంబోజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్, మయాంక్ మార్కండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.