https://oktelugu.com/

India Vs Pakistan: టి20 క్రికెట్లో పాక్ పై భారత్ సంచలనానికి పునాది పలికింది అప్పుడే.. ఆ ఘనతకు నేటితో 17 ఏళ్లు..

2007 t20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఆ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో భారత్ ఓ లీగ్ మ్యాచ్ ఆడింది. అందులో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 15, 2024 / 08:01 AM IST

    India Vs Pakistan

    Follow us on

    India Vs Pakistan: దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన మొట్టమొదటి టి20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది.. తొలిసారి ప్రయోగాత్మకంగా జరిగిన ఈ పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు కు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటికీ అది భారత అభిమానుల కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక సందర్భంలో ఆ వీడియో దర్శనమిస్తూనే ఉంటుంది. అయితే టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుకు ఉంటుంది. ఈ మ్యాచ్ లో జరిగిన బౌల్ అవుట్ టోర్నీ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. అటు పాకిస్తాన్, ఇటు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 141 రన్స్ మాత్రమే చేశాయి. దీంతో మ్యాచ్ ఫలితం రాబట్టేందుకు బౌల్ అవుట్ ను నిర్వహించారు. ఇందులో టీమ్ ఇండియా 3-0 తేడాతో సంచలన విజయం సాధించింది. పాకిస్తాన్ పై గెలిచి సూపర్ -8 కు వెళ్లిపోయింది. ఈ అద్భుతమైన సంఘటన జరిగి నేటితో 17 ఏళ్లు పూర్తవుతున్నాయి. భారత జట్టు తరఫున వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. బౌల్ అవుట్లో అద్భుతమైన ప్రతిభ చూపించారు. ఇక పాకిస్తాన్ బౌలర్లు యాసిర్ అరాఫత్, గుల్, సాహిత్ ఆఫ్రిది బౌల్ అవుట్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

    ఫైనల్ లోనూ పాక్ పైనే..

    మరోవైపు ఈ టోర్నీ ఫైనల్ జోహెన్నెస్ బర్గ్ లో జరిగింది. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేసింది గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 30 పరుగులు సాధించాడు. ఫలితంగా ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 157 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ చేజ్ చేసేందుకు పాకిస్తాన్ బరిలోకి దిగింది. 152 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ముఖ్యంగా జోగేంద్ర శర్మ వేసిన చివరి ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చింది. ఆ ఓవర్ లో ఆఖరి 4 బంతులకు ఆరు పరుగులు చేస్తే పాకిస్తాన్ విజయం సాధించేది. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. అప్పటికే మిస్బా ఉల్ హక్ 43 పరుగులు చేశాడు. జోగిందర్ శర్మ వేసిన రెండవ బంతికి సిక్స్ కొట్టాడు. దీంతో పాకిస్తాన్ సంచలనం నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే మూడో బంతికి మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే షార్ట్ ఫైన్ లెగ్ లో ఉన్న శ్రీశాంత్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. తొలి టి20 వరల్డ్ కప్ టైటిల్ దక్కించుకున్న జట్టుగా రికార్డ్ సృష్టించింది.