Riyan Parag
Riyan Parag: వికెట్ తీస్తే మీసం మేలేస్తాడు. ఫోన్ కొడితే తొడకొడతాడు. సిక్స్ బాదితే జబ్బలు చరుచుకుంటాడు. క్యాచ్ పడితే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ఇవన్నీ చూసే సోషల్ మీడియాలో అతడికి ఓవర్ యాక్టింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. పైగా అతడు అంతకుముందు సీజన్లలో పెద్దగా మెరిసింది లేదు. దీంతో అతడు వెలుగులోకి రాలేదు. కానీ ఈ సీజన్లో నక్క తోక తొక్కాడు కావచ్చు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అవసరమైతే జట్టు భారాన్ని భుజాల మీద మోస్తున్నాడు. ఫలితంగా ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత చర్చనీయాంశమైన ఆటగాడిగా మారిపోయాడు. అతడే రియాన్ పరాగ్.
సోమవారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ మెరిశాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ముంబై బౌలర్ ఆకాష్ మద్వాల్ ధాటికి మూడు వికెట్లు కోల్పోయింది.. ఒకానొక దశలో ముంబై అద్భుతం చేసేలాగా కనిపించింది.. కానీ రియాన్ పరాగ్ అలాంటి అవకాశం ముంబై జట్టుకు ఇవ్వలేదు 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ జట్టును గెలిపించడమే కాదు.. వరుసగా మూడో విక్టరీ అందించాడు. రియాన్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు చేశాడు.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 84 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. సోమవారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.. 54 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాదు.. రాజస్థాన్ కు మూడో విజయాన్ని కట్టపెట్టాడు.
ముంబై జట్టుతో ఆడే ముందు.. జట్టు ఆటగాళ్లతో కలిసి రియాన్ పరాగ్ ముంబై వాంఖడే మైదానంలో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతడి మాతృమూర్తి మితు బారుహా దాస్ ఘన స్వాగతం పలికింది. కొడుకును చూసి ఆనందంతో ఉబ్బితబ్బియిపోయింది. కొడుకు నుదుటన ముద్దు పెట్టుకుంది. అతడిని ప్రేమతో ఆలింగనం చేసుకుంది. అంతేకాదు అతని బ్యాగ్ లో ఉన్న ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ను తనకు ధరించింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అన్నట్టు రియాన్ మాతృమూర్తి బారుహదాస్ అస్సాం తరుపున అంతర్జాతీయ స్విమ్మర్ గా రాణించారు. పలు పతకాలు సాధించారు. రియాన్ పరాగ్ తండ్రి కూడా క్రీడాకారుడు. మితూ బారుహ దాస్, ఆమె భర్త ఇద్దరూ క్రీడాకోటా లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రైల్వే విభాగంలో కీలక స్థానాల్లో ఉన్నారు.. తమలాగే.. వారి కుమారుడైన రియాన్ పరాగ్ ను క్రీడల వైపు మళ్ళించారు. అతడు వారి ఆశలు వమ్ము చేయకుండా క్రికెట్ వైపు దృష్టిసారించాడు. గత ఏడాది రంజీ సీజన్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదే జోరును ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగిస్తున్నాడు.