Hardik Pandya And Riyan Parag: 2022లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనామక గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. ఎటువంటి అంచనాలు లేని ఆ జట్టును విజేతగా నిలిపాడు. 2023 సీజన్లోనూ ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. చెన్నై జట్టుతో హోరాహోరిగా తలపడి చివరికి రన్న రప్ గా నిలిపాడు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు అతడిని గుజరాత్ జట్టు నుంచి రిటైన్ చేసుకుంది. ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినప్పటికీ.. రోహిత్ శర్మ ను కెప్టెన్ పదవి నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా కూడా ముంబై జట్టుకు ఆడిన వాడే. దశాబ్ద కాలం ఆ జట్టుతో అనుబంధం కొనసాగించినవాడే. జట్టుతో విభేదాల నేపథ్యంలో గుజరాత్ కు వెళ్ళాడు. ఎంట్రీ సీజన్లోనే విజేతగా.. మలి సీజన్ లో రన్న రప్ గా నిలిపాడు.
ముంబై జట్టుకు కెప్టెన్ గా నియామకమైన నాటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్ గా అతడు జట్టులోకి ఎంట్రీ ఇవ్వకముందే రోహిత్ అభిమానులు అతడిని విమర్శించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఏకి పారేయడం ప్రారంభించారు.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా చేసిన కొన్ని కామెంట్స్ కూడా వివాదానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు కెప్టెన్ గా అతడు బాధ్యతలు తీసుకోవడం.. ఐపీఎల్ 17వ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి. కానీ ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ముంబై ఓడిపోయింది. రెండవ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్ రాజస్థాన్ చేతిలోనూ పరాజయం పాలైంది. ప్రారంభ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ లో ఉంచాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా పై రోహిత్ అభిమానులు విపరీతంగా విమర్శలు చేశారు. సీనియర్, మాజీ కెప్టెన్ కు గౌరవం ఇవ్వడం తెలియదా అంటూ దెప్పి పొడిచారు. మరుసటి మ్యాచ్ లో అయితే బౌలింగ్ కూర్పు సరిగ్గా లేకపోవడంతో హైదరాబాద్ జట్టు ముంబై పై ఏకంగా 277 పరుగులు చేసింది. హైదరాబాద్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను ఒక ఆట ఆడుకున్నారు.
ఇక అప్పటినుంచి హార్దిక్ పాండ్యా పై విమర్శలు మరింత పెరిగాయి. దీంతో సోషల్ మీడియాలో మీమర్స్ రెచ్చిపోతున్నారు. గత ఏడాది రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్ ఓవర్ యాక్షన్ తో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సీజన్లో వారందరికీ తన ఆట తీరుతో సమాధానం చెబుతున్నాడు. రాజస్థాన్ జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతూ.. గెలిపిస్తున్నాడు. ఈ ఏడాది హార్దిక్ పాండ్యా అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వీరిద్దరూ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” ఈ ట్రోల్స్ నేను తట్టుకోలేకపోతున్నాను రా” అని రియాన్ పరాగ్ ను ఉద్దేశించి హార్దిక్ పాండ్యా అంటుండగా..”గత ఏడాది నేను కూడా ఇదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాను. మన మీద రాళ్లు పడ్డప్పుడు వాటిని ఏరుకొని ఇల్లు కట్టుకోవాలి కానీ.. సమాధి కాదు” అని రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు మీమ్ రూపొందించారు. ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.. ఇక కొంతమంది అభిమానులు ఈ మీమ్ చూసి.. ” నువ్వు ముంబై జట్టు కెప్టెన్ గా అయినందుకు కాదు ఈ విమర్శలు.. మొదటి మ్యాచ్ లో సీనియర్ ఆటగాడనే గౌరవం కూడా ఇవ్వకుండా రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ పెట్టావు చూడు.. అందుకు” అంటూ నెటిజన్లు హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్నారు.