Rishabh Pant “రోడ్డు ప్రమాదం లో కారో, బైకో రోడ్డుమీద పడిపోతుంది, కానీ ప్రమాదం అంటే అది కానే కాదు.. ఓ కుటుంబం నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా పడిపోవడం” సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఓ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఆ క్రికెటర్ నిజ జీవితంలో జరిగిన సంఘటనకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అందమైన కెరియర్.. పాతికేళ్ల వయసు.. టీమిండియాలో చోటు.. రెండు చేతులా సంపాదన.. జిందగీ నా మిలే దోబారా.. అని పాడుకుంటున్న ఆ క్రికెటర్ జీవితాన్ని.. రోడ్డు ప్రమాదం కకావికలం చేసింది. ఇంకొకరైతే ఆ స్థానంలో ఉంటే లేచి నిలబడే వారు కాదు. తన కెరియర్ ను పునర్నిర్మించుకునేవారు కాదు. కానీ, అతడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పునర్జన్మ పొంది, కాలు, చేయి కూడదీసుకున్నాడు. చివరికి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. చదువుతుంటే ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ ఆటగాడు ఎవరో..
రిషబ్ పంత్.. టీమిండియా క్రికెట్ జట్టు యువకిశోరం. కీపింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకున్న ఈ ఆటగాడు.. గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మంచానికే పరిమితమయ్యాడు. కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఆ ప్రమాద తీవ్రతకు అతడు రెండు నెలలపాటు పళ్ళు కూడా తోముకోలేదు. నరకాన్ని అనుభవించాడు. చివరికి బయటకు రావాలన్నా కూడా భయపడేవాడు. ఆ ప్రమాదం అతడి జీవితాన్ని సమూలంగా మార్చేసింది.. మంచానికే పరిమితం కావడంతో.. ఇక జీవితంలో క్రికెట్ ఆడలేననుకున్నాడు. కానీ అదే సమయంలో అతనిలో ఆత్మవిశ్వాసం ఆ ప్రమాదాన్ని గేలి చేసింది. ఒంట్లో సత్తువను తిరిగి లేపింది. ఫలితంగా గోడకు కొట్టిన బంతిలాగా అతడు దూసుకొచ్చాడు. ఐపీఎల్ లో మెరవడంతో టి20 వరల్డ్ కప్ లో టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు.
రోడ్డు ప్రమాదం తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్ట్ చేస్తున్న ఓ షో లో రిషబ్ పంత్ పంచుకున్నాడు. ” రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత.. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్నాను. కాళ్లు, చేతులు కదలడం లేదు. జీవితమంతా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. లేవగలుగుతానా, నడవగలుగుతానా? అనే సందేహాలు నా మదిని తొలవడం ప్రారంభించాయి. ఎలాగోలా లేచాను. అడుగు తీసి అడుగు వేసాను. చేతులను కదిలించడం ప్రారంభించాను. మంచం పై ఉన్న సమయంలో రెండు నెలల పాటు నేను పళ్లు తోముకోలేదు. నా జీవితంలో అత్యంత కఠినమైన దశ అది. నెలల తరబడి మంచానికే పరిమితం కావడంతో ఇబ్బందిగా అనిపించేది. ఆ సమయంలో నా తల్లిదండ్రులు అండగా ఉన్నారు. స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చారు. శ్రేయోభిలాషులు నాలో స్ఫూర్తిని నింపారు. చివరికి ఇలా మీ ముందుకు వచ్చానంటూ” రిషబ్ పేర్కొన్నాడు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిషబ్ పంత్ మాటలు చాలామందిని కదిలిస్తున్నాయి. జీవితంలో అన్నీ ఉన్నా చాలామంది ఏమీ చేయలేరు. కొంతమందికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా లేవగలుగుతారు. అచంచలమైన స్ఫూర్తితో లక్ష్యాన్ని అందుకోగలుగుతారు. అటువంటి వారిలో రిషబ్ పంత్ ముందు వరుసలో ఉంటాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.