Rishabh Pant Injury Update: దెబ్బ మీద దెబ్బ.. గాయం మీద గాయం.. ఒకదాని నుంచి కోలుకోగానే మరొకటి.. దాని నుంచి సాంత్వన పొందగానే ఇంకొకటి.. ఇదిగో ఇలా సాగిపోతోంది టీం ఇండియా డాషింగ్ వికెట్ కీపర్ పంత్ కెరియర్. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్ లో తీవ్రంగా గాయపడడంతో ఆయన మళ్లీ ఇంటికి పరిమితం కావాల్సి వస్తోంది.
Also Read: జగన్, కెసిఆర్ సర్వశక్తి సంపన్నులు.. వారిని మన వ్యవస్థలు ఏమీ చేయలేవు
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం పంత్ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆయనను గుర్తించి ఆసుపత్రికి తరలించారు.. తీవ్రమైన గాయాలతో పంత్ దాదాపు రెండు సంవత్సరాల పాటు క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. ఆస్పత్రి, నేషనల్ క్రికెట్ అకాడమీ తోనే సరిపోయింది. తీవ్రంగా గాయాలు కావడంతో కొద్ది నెలల పాటు అతడు బ్రష్ కూడా చేసుకోలేకపోయాడు.. అంతటి విపత్కర పరిస్థితుల నుంచి అతడు కోలుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
టి20 వరల్డ్ కప్ లో పర్వాలేదు అనిపించాడు. కానీ ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం దుమ్మురేపాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టి తన సత్తా ఏమిటో చూపించాడు. అయితే ఇదే ఇంగ్లాండ్ సిరీస్ లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలు చిటికెన వేలు చిట్లిపోవడంతో.. అతడు ఇప్పుడు ఇంటికి పరిమితం కావలసి వస్తోంది. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచన చేయడంతో.. ఇంట్లోనే గడుపుతున్నాడు. ఇంట్లో ఉండడం అతడికి బోర్ కలిగిస్తోంది. మరో వైపు త్వరలోనే ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. పంత్ గాయపడిన నేపథ్యంలో అతన్ని మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు.
కాలుకు గాయం కావడం.. ఇంటికే పరిమితం కావలసి రావడంతో పంత్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. జిమ్ లో చిన్నచిన్న కసరత్తులు చేస్తున్నప్పటికీ అతడిలో ఉన్న ఆటగాడికి సంతృప్తి కలగడం లేదు. అందువల్లే తీవ్రమైన వేదనకు గురవుతున్నాడు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండడం.. ఇబ్బందిగా ఉందంటూ ఇన్ స్టా లో పంత్ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. తన ఇంట్లో ఉన్న జిమ్ లో పంత్ కాలికి పట్టి వేసుకుని కనిపించాడు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు శరీరాన్ని కాపాడుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.