Rishabh Pant: ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు లక్నో జట్టు 6 మ్యాచులు ఆడింది. నాలుగుసార్లు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు విజయాలు సాధించడంలో ఒక్కో సందర్భంలో ఒక్కో ఆటగాడు ప్రతిభ చూపుతున్న నేపథ్యంలో గెలుపులు సొంతమవుతున్నాయి. వాస్తవానికి లక్నో జట్టులో అత్యంత విలువైన ఆటగాడు రిషబ్ పంత్. కానీ ఇంతవరకు అతడు తన స్థాయికి తగ్గట్టుగా ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఎడమచేతివాటంతో చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టించే రిషబ్ పంత్.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా అలాంటిది ఆడ లేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచులలో రిషబ్ పంత్ శనివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చేసిన 21 పరుగులే హైయెస్ట్ స్కోర్ అంటే.. అతని బ్యాటింగ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అసలు పంజాబ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో అయితే రిషబ్ పంత్ డక్ అవుట్ కావడం విశేషం. అతడు 0 పరుగులకే అవుట్ కావడంతో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని లక్నో జట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఓపెనర్ గా వచ్చినప్పటికీ
శనివారం గుజరాత్, లక్నో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180 రన్స్ చేసింది. 181 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన లక్నో జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.. లక్నో జట్టు చేజింగ్ కు దిగిన క్రమంలో మార్క్రం కు జోడిగా రిషబ్ పంత్ వచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన పంత్ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఇంకేముంది మనవాడు లైన్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన పంత్ 18 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సహాయంతో 21 పరుగులు చేశాడు. ఇప్పటివరకు లక్నో జట్టు సాధించిన విజయాలలో ఒక్కో సందర్భంలో ఒక్కో ఆటగాడు కీలకంగా ఆవిర్భవించాడు.. శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రాటి, నికోల స్ పూరన్, మార్క్రం వంటి ఆటగాళ్లు లక్నో జట్టు సాధించిన విజయాలలో కీలకంగా వ్యవహరించారు. మరి 27 కోట్లు దక్కించుకున్న రిషబ్ పంత్ ఇలా కీలకంగా ఎప్పుడు మారతాడని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ సీజన్లో వన్ టౌన్ ఆటగాడిగా పలు మ్యాచ్లలో ఆడిన రిషబ్.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక శనివారం నాటి మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చాడు. కాస్త బ్యాటింగ్ మారినప్పటికీ.. అతని స్థాయిలో మాత్రం ఆట తీరును ప్రదర్శించలేకపోయాడు.