LSG Vs DC 2024: వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టింది. శుక్రవారం రాత్రి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాలలో ఢిల్లీ జట్టు సత్తా చాటింది.. పాయింట్లు పట్టికలో పదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 55* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ కే ఎల్ రాహుల్ 39 పరుగులతో సత్తా చాటాడు. ఢిల్లీ బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి లక్నో జట్టు పతనాన్ని శాసించాడు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ జట్టు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. విదేశీ బ్యాటర్ ఫ్రేజర్ 55 పరుగులతో ఢిల్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 41 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలో అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. సమీక్ష విషయంలో అంపైర్ తో పంత్ చాలాసేపు చర్చలు జరిపాడు.
లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో దేవదత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇశాంత్ శర్మ బౌలింగ్ వేస్తున్నాడు. ఈ క్రమంలో ఇషాంత్ వేసిన ఓ బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. దీంతో సమీక్ష కోరుతున్నట్టు ఢిల్లీ కెప్టెన్ పంత్ ” టీ – సంకేతం” చూపించాడు. అయితే ఆ సమయంలో పంత్ ఎంపైర్ వైపు చూడలేదు. మరోవైపు పంత్ “టీ – సంకేతం” చూపించడంతో సమీక్ష కోరుతున్నట్టు అంపైర్లు భావించారు. రివ్యూ కోసం థర్డ్ అంపైర్ కు పంపించారు. ఈ విషయం మైదానంలో గందరగోళానికి గురిచేసింది. తాను సమీక్షను కోరలేదని అంపైర్ తో పంత్ వాగ్వాదానికి దిగాడని.. ఆ సమయంలో వ్యాఖ్యాతలు భావించారు.
అనంతరం వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాన్ని సవరించుకున్నారు. “వైడ్ అవునా? కాదా? అని కోరిన సమీక్షలో అంపైర్లు స్నికో మీటర్ ను ఉపయోగించడం వల్ల పంత్ అసంతృప్తికి గురయ్యాడని, అందువల్లే వాగ్వాదానికి దిగాడని” పేర్కొన్నారు.. అయితే ఈ వివాదానికి ఇదే కారణమా? మరొకటా? అని తెలియదు గానీ.. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గిల్ క్రిస్ట్ స్పందించాడు. “అది ఏ ఫార్మాట్ అయినప్పటికీ అంపైర్ల నియంత్రణలోనే మ్యాచ్ ఉండాలి. వారి సమక్షంలోనే మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లేలా ఆటగాళ్లు ఆడాలి. పంత్ లేదా ఇతర ఆటగాళ్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. అంపైర్లు ఆటను ముందుకు తీసుకెళ్లాలి.. మధ్యలో విరామం కలిగించకూడదు. ఎందుకంటే ప్రేక్షకులకు అసహనం కలిగితే అప్పుడు కథ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ అదే పనిగా ఆటగాళ్లు మాట్లాడుతుంటే కచ్చితంగా పెనాల్టీ విధించాలని” గిల్ క్రిస్ట్ స్పష్టం చేశాడు.. పంత్ తీరు పట్ల చురకలు అంటించాడు.