King Cobra: సాధారణంగా పాము చూస్తేనే పారిపోతాం. అటువంటిది 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపిస్తే.. బుసలు కొడితే.. ఊహించడానికి భయంగా ఉంది కదూ. సాధారణంగా అటవీ ప్రాంతంలో కనిపించే ఈ కింగ్ కోబ్రా.. జనార్యణంలోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నానా హైరానా పడ్డారు. చివరికి వైల్డ్ లైఫ్ సిబ్బంది దానిని పట్టుకొని క్షేమంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలో రేకుల షెడ్డు ఉంది. అందులో గిరి నాగు వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. అయితే భారీ శబ్దం చేస్తూ బయటకు వచ్చిన ఆ పాము 12 అడుగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద నాగును చూసేసరికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు స్నేక్ క్యాచర్ వెంకటేష్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటేష్ బృందం దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి ఆ గిరినాగును సంచిలో బంధించారు. అనంతరం రామచంద్రాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కొద్ది నెలల కిందట మాడుగుల మండలం లక్ష్మీదేవి పేటలో సైతం ఇటువంటి కింగ్ కోబ్రానే జనావాసాల్లోకి వచ్చింది. పాఠశాల మరుగుదొడ్డిలో ప్రవేశించింది. బుసలు కొట్టడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పామును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రాలు అధికంగా ఉన్నాయి. ఇటీవల అటవీ ప్రాంతం కనుమరుగు కావడంతో బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.