Janasena: జనసేనలో మరో విచిత్రం

పొత్తులో భాగంగా తొలుత జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. బిజెపి ఎక్కువ సీట్లు కోరడంతో తనకు లభించిన సీట్లను పవన్ త్యాగం చేసుకున్నారు.

Written By: Dharma, Updated On : April 13, 2024 12:01 pm

Janasena

Follow us on

Janasena: ఎన్నికల్లో ఆది నుంచి జనసేన లో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలకు కాకుండా.. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడం సంచలనంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా సేవలందించిన వారికి పెద్దగా టికెట్లు దక్కలేదు. ఒకరిద్దరు నేతలకు తప్ప ఇతరులను కనీస స్థాయిలో కూడా గుర్తించలేదు. పోనీ వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారంటే పర్వాలేదు.. కానీ మిత్రపక్షమైన తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు కట్టబెట్టారు. పొత్తులో భాగంగా.. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జ్ లకు అవకాశం లేకుండా పోయింది. అటువంటి వారిని జనసేనలోకి రప్పించి సీట్లు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పొత్తులో భాగంగా తొలుత జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. బిజెపి ఎక్కువ సీట్లు కోరడంతో తనకు లభించిన సీట్లను పవన్ త్యాగం చేసుకున్నారు. మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకున్నారు. జనసేనకు లభించిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు సైతం ఎప్పటినుంచో సేవలందిస్తున్న జనసైనికులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలు ఉన్నచోట్ల.. పొత్తుల్లో భాగంగా జనసేనకు సీట్లు దక్కించుకోలేకపోయారు. పొత్తుల్లో లభించిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వారికి పిలిచి మరీ టిక్కెట్లు ఇచ్చారు. భాగస్వామ్య పార్టీలకు దక్కిన నియోజకవర్గాల్లో జనసేన బలమైన నేతలను కాపాడుకోలేకపోయారు.

వాస్తవానికి వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ వంటి నేతలు టిడిపిలో చేరాలనుకున్నారు. కానీ వారు అనూహ్యంగా జనసేనలో చేరారు. ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, వైసీపీకి చెందిన ఆరని శ్రీనివాసులు జనసేనలో చేరి.. ఆ మరుక్షణం ఆ పార్టీ అభ్యర్థులు అయ్యారు. దీంతో నిజమైన జనసైనికులకు చోటు దక్కలేదు. తిరుపతిలో కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, సుగుణమ్మ వంటి వారు టికెట్ ఆశించారు. కానీ చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు వైసీపీ నుంచి రప్పించి టికెట్ ఇప్పించారు. దీంతో సుగుణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఇప్పుడు అదే సుగుణమ్మ జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ శ్రేణులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతిలో ఆరని శ్రీనివాసులను మార్చి సుగుణమ్మకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మిగతా రాజకీయ పార్టీల్లో లేని చిత్రవిచిత్ర పరిస్థితులు జనసేన లోనే కనిపిస్తుండడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.