MS Dhoni
MS Dhoni : అందు గురించే మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. టీమిండియాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి పేరు ఉంది. ఐపీఎల్ లో చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘనత కూడా అతనికి ఉంది. అందువల్లే అతడిని చెన్నై అభిమానులు తలా అని పిలుస్తారు. మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఉన్నప్పుడు నాయకుడిగా.. మైదానం వేలుపల ఉన్నప్పుడు ఒక సామాన్యుడిగా ఉంటాడు. అందువల్లే అతడిని కోట్లాదిమంది అభిమానిస్తుంటారు. క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇప్పటికీ అతడు ఐపిఎల్ ఆడుతూనే ఉన్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి. ఈ వయసులోనూ ధోని తెగువను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు..ఇది కదా తలా విశ్వరూపం అని కామెంట్లు చేశారు. అయితే ఇటీవల ఓ యాప్ లాంచ్ కార్యక్రమానికి ధోని ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
క్షమించే గుణం ఉండాలి
యాప్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన ధోని.. పిచ్చాపాటిగా మాట్లాడాడు. ” అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాను. ఇప్పుడు స్కూల్ పిల్లాడి లాగా ఆటను ఆస్వాదిస్తున్నాను. చిన్నప్పుడు క్రికెట్ ను చాలా ఇష్టంగా ఆడాను. ఇప్పుడు కూడా అలానే ఆటను ఆస్వాదిస్తున్నాను. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాను. ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది.. నా చిన్నప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు ఆటలు ఆడుకునేందుకు ఒక పీరియడ్ ఉండేది. అప్పుడు మేము క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళం. ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా ఉంటే ఫుట్ బాల్ ఆడేవాళ్లం. చిన్నప్పుడు క్రికెట్ కోసం పరితపించేవాళ్లం. ఇప్పుడు కూడా అదే ఇష్టంతో ఆడుతున్నాను.. ఇక టీమిండియా విషయానికి వస్తే ఆటగాళ్ల ఫోకస్ సరిగా ఉండాలి. నేను మైదానంలో ఉన్నప్పుడు ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టేవాడిని. అప్పుడు నాకు ఆట మాత్రమే ముఖ్యంగా ఉండేది. ఒక ఆటగాడిగా టీమిండియా కోసం మెరుగైన ప్రదర్శన చేయాలని భావించేవాణ్ణి. దేశం తరఫున ఆడే అవకాశం అందరికీ రాదు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేశం తరఫున ఆడుతున్నప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి మ్యాచ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అందరికీ ఉంటుంది. దానిని సాకారం చేసుకునే దిశగా ఆటగాళ్లు పరితపించాలి. తీవ్రంగా శ్రమించాలి. అప్పుడే బాగుంటుంది.. జీవితంలో క్షమించే గుణం కచ్చితంగా ఉండాలి. ప్రతీకారం అనే ఆలోచనను పక్కన పెట్టాలి. లేకపోతే మనుషులు వేరే విధంగా మారిపోతారు. అయితే ఇటీవలి కాలంలో మనుషుల్లో ప్రతీకారం అనేది పెరిగిపోతుంది. అదే బాధ కలిగిస్తోందని” ధోని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ధోని భావోద్వేగానికి గురయ్యాడు.. స్థిరంగా ఉండే ధోని ఇలా భావోద్వేగానికి గురి కావడం అక్కడికి వచ్చిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.