https://oktelugu.com/

Rohit Sharma: క్యాచ్ జార విడిచినా.. హాఫ్ సెంచరీ చేయకపోయినా.. నెట్టింట రోహిత్ పై ప్రశంసలు.. కారణమిదే

చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. భారత బౌలర్ల ధాటికి 228 పరుగులకు ఆలౌట్ అయింది.

Written By: , Updated On : February 20, 2025 / 09:32 PM IST
Rohit Sharma

Rohit Sharma

Follow us on

Rohit Sharma : బంగ్లాదేశ్ ఆటగాళ్లలో హృదయ్ సెంచరీ చేశాడు. జాకీర్ అలీ 68 పరుగులు చేశాడు. మహమ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు.. జాకీర్ అలీఅక్షర్ పటేల్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యేవాడు. స్లిప్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ క్యాచ్ ను జారవిడిచాడు. ఫలితంగా జాకీర్ అలీ బతికిపోయాడు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా కూడా జాకిర్ అలీ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు. ఫలితంగా వచ్చిన జీవధానాలను జాకీర్ అలీ సద్వినియోగం చేసుకున్నాడు. మరో ఆటగాడు హృదయ్ తో కలిసి ఆరో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. వీరిద్దరూ దూకుడుగా ఆడటం వల్ల బంగ్లాదేశ్ 228 పరుగులు చేసింది.

229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ప్రారంభం నుంచి దూకుడుగా ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సహాయంతో 41 పరుగులు చేశాడు.. హాఫ్ సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్న అతడు టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గిల్(60*) తో కలిసి తొలి వికెట్ కు రోహిత్ శర్మ 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలలో 11 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా రాహుల్ ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేలలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. మొత్తం 463 మ్యాచ్లలో అతడు 18,426 పరుగులు చేశాడు. అతని తర్వాత విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ మొత్తంగా 298 మ్యాచ్లలో 13,963 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్లలో 11,221 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు. దుబాయ్ మైదానంలో 41 పరుగులు చేయడం ద్వారా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 269 మ్యాచ్లలో రోహిత్ శర్మ 11,002 పరుగులు చేశాడు. ఇక రాహుల్ ద్రావిడ్ 340 మ్యాచ్లలో 10,768 పరుగులు చేశాడు.. రోహిత్ శర్మ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.. అయితే ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత అహ్మదాబాద్ వన్డేలో తేలిపోయాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ దూకుడుగా ఆడాడు. తన మునుపటి ఆట తీరును ప్రదర్శించాడు. సిక్సర్ కొట్టకపోయినప్పటికీ.. ఫోర్ లతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడు చేసిన 41 పరుగులలో 7 ఫోర్లే ఉన్నాయంటే అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.