Shubhman Gil : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముందుగా బ్యాటింగ్ చేసింది. 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హృదయ్ సెంచరీ చేశాడు. జాకీర్ అలీ 68 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 154 పరుగులు జోడించారు. వీరిద్దరు కనుక నిలబడి ఆడకపోయి ఉంటే బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. అయితే టీమిండియా ఫీల్డర్లు క్యాచులను జారవిడవడంతో వీరు బతికిపోయారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. తద్వారా టీమిండియా ఎదుట 229 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందు ఉంచారు.
229 రన్స్ టార్గెట్ తో టీమిండియా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు.. 36 బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో 41 రన్స్ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికి మరో ఓపెనర్ గిల్ (101*) తో కలిసి తొలి వికెట్ కు 69 పరుగులు జోడించాడు.. 41 పరుగులు చేసిన తర్వాత రోహిత్ ఔట్ అయ్యాడు.. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ(22) వేగంగా ఆడే క్రమంలో రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్( 15), అక్షర్ పటేల్ (8) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.. అయితే ఈ దశలో గిల్, కేఎల్ రాహుల్ (41*) స్ఫూర్తివంతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 87 పరుగులు జోడించారు. టీమిండియా కు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.
గిల్ సూపర్ సెంచరీ
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో గిల్ సెంచరీ చేశాడు. అంతేకాదు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనూ వైస్ కెప్టెన్ హోదాలో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా సెంచరీ చేసి అదరగొట్టాడు. 129 బంతులు ఎదుర్కొన్న గిల్ 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 101* పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. అంతేకాదు వన్డేలలో తాను ఎంత స్పెషలో నిరూపించుకున్నాడు.