Moringa Benefits: సహజంగానే ప్రకృతి ఎన్నో ఔషధాలను విటమిన్లు, మినరల్స్ ను అందిస్తుంటుంది. ఆకులు, కూరగాయలు, పండ్లతో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు అందుతాయి. అంతే కాదు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి. ప్రకృతి అందించే వాటిలో మునగ చెట్టు కూడా ఒకటి. దీన్ని ఒక అద్భుతమైన చెట్టుగా పరిగణిస్తారు. నీరు ఉండే స్థలంలో ఈ చెట్టు ఎక్కువగా పెరిగి రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. మునగ కాయలు, ఆకులు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి.
ఒక్క మునగాకు తిన్నా కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు రక్తహీనతకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందట. అయితే మునగాకు ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉందని చెబుతున్నాయి గణాంకాలు. ఈ మునగ తోటల పెంపకం వల్ల ఆదాయం, ఆరోగ్యం రెండు చేపట్టవచ్చు. మరి ఈ మునగ తోటల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, తోట విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి కూడా తెలుసుకుందాం.
రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఐరన్ మాత్రలను వాడుతుంటారు ప్రజలు. కానీ దీనికి బదులు మునగ ఆకు పొడిని తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట. పాలకంటే మునగాకులో నాలుగు రెట్ల కాల్షియం, రెండు రెట్లు అధికంగా జీర్ణం అయ్యే ప్రోటీన్లు ఉంటాయట. దీనివల్ల కాల్షియం సప్లిమెంట్ ల మాదిరి కూడా ఈ మునగ ఆకు ఉపయోగపడుతుంది. ఇక మునగ కాయలను పప్పులో వేసుకొని లేదా విడిగా వీటిని కూరగా కూడా చేసుకొని తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
మునగాకుతో రొట్టెలు, బిస్కెట్లు, తదితర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. మునగ చెట్టు ఆకులు కాయలు గింజలలో ప్రజలకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో పోటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి, ఇనుము వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకే మునగాకు, మునగ కాయలు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. దీని వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేవరు.