RCB IPL Future : కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న ఘటన ఐపీఎల్ లో కన్నడ జట్టు భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రమాదం ఉందా? ఒకవేళ మేనేజ్మెంట్ తప్పు ఉందని తెలితే బీసీసీఐ తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బిసిసిఐ కన్నడ జట్టు మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అది కూడా సరిపోదూ అనుకుంటే ఏకంగా జట్టుపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించే ప్రమాదం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఊహగానాలు మాత్రమేనని.. బిసిసిఐ అటువంటి చర్యలు తీసుకోకపోవచ్చని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ జట్టు యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం పై కేసులు నమోదు చేశారు. ఈ కేసును ప్రభుత్వం నియమించిన బృందం విచారిస్తోంది. ఇప్పటికే కన్నడ జట్టుకు సంబంధించిన ఒక ఉన్నతాధికారిని కటకటాల వెనక్కి పంపించింది. ఇక కర్ణాటక క్రికెట్ సంఘంలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ పదవులను వదిలేశారు.. ఇవన్నీ తెరపైకి కనిపిస్తున్నవే.. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కన్నడ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ దాపరికం ప్రదర్శించడం లేదు. అలాంటప్పుడు ఐపీఎల్ నుంచి కన్నడ జట్టును తొలగించడంలో అర్థం లేదని” క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read : బ్రహ్మీ డ్యాన్స్ కాపీ కొట్టిన ప్రభుదేవా.. నవ్వుల వీడియో…
అది సాధ్యం కాకపోవచ్చు
కన్నడ జట్టు మేనేజ్మెంట్ వ్యవహార శైలిపై ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన దారుణాన్ని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. కన్నడ జట్టు మేనేజ్మెంట్ నిర్వహించిన కార్యక్రమం ప్రైవేటుదే అయినప్పటికీ.. అది క్రికెట్ కు సంబంధించిన వ్యవహారం కావడం వల్ల.. ఆ బాధ్యత మొత్తం తామే వహిస్తామని సైకియా ప్రకటించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉందని.. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి దారుణాలు జరగకుండా ఉంటాయో.. ఆ దిశగానే తమ అడుగులు ఉంటాయని సైకియా వెల్లడించారు. అంటే ఈ లెక్కన కన్నడ జట్టుపై ఏదో కత్తి వేలాడుతూ ఉందని అర్థమవుతోంది. ఇక టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌనంగా ఉండకుండా ఓపెన్ గానే అన్నీ మాట్లాడేశారు. ఇటువంటి సంబరాలకు తాను దూరమని ప్రకటించారు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం పొట్టి ఫార్మాట్ విశ్వకప్ ను భారత బృందం సొంతం చేసుకున్నప్పుడు..విజయ యాత్ర నిర్వహించాలి అనే చర్చ వచ్చినపుడు వ్యతిరేకించాలని గౌతమ్ గంభీర్ గుర్తు చేశాడు. అసలు ఇలాంటి వ్యవహార శైలి సరైనది కాదని గంభీర్ పేర్కొన్నాడు..
తప్పు ఉందని తేలితే..
ఇక ప్రస్తుతం ఈ కేసు కు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కన్నడ జట్టు మేనేజ్మెంట్ తప్పు ఉందని తెలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇక గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించిన కారణంగా తమిళ, రాజస్థాన్ జట్లపై రెండు సంవత్సరాల పాటు ఐపిఎల్ నిర్వహణ కమిటీ నిషేధం విధించింది. ఇప్పుడు కన్నడ జట్టు మేనేజ్మెంట్ పాత్ర ఏమైనా జరిగిన ఘటనలో ఉంటే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని అవకాశాలు కొట్టి పారేయలేమని సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.