RCB Criticism to Victory : మంగళవారం నాటి ఐపీఎల్ చివరి మ్యాచ్లో కూడా బెంగళూరు ఇదేవిధంగా ఆడింది. ఇప్పుడు మాత్రమే కాదు అనేక సందర్భాల్లో బెంగళూరు ఇదే తీరైన ఆటను ప్రదర్శించి ఆకట్టుకుంది. బెంగళూరు ఫైనల్ వెళ్లడం ఇది తొలిసారి కాదు. దీని కంటే ముందు మూడుసార్లు ఫైనల్స్ కు వెళ్ళింది.. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఒకసారి దక్కన్ చార్జర్స్, ఇంకోసారి సన్ రైజర్స్ హైదరాబాద్, మరోసారి చెన్నై జట్ల చేతిలో ఓటమిపాలైంది. వాస్తవానికి మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ.. ట్రోఫీని అందుకోలేకపోవడంతో బెంగళూరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. అత్యంత దురదృష్టకరమైన జట్టు అని ముద్రపడింది. ఇక సోషల్ మీడియాలో విమర్శలకైతే లెక్కేలేదు. అభిమానులు ఓవరాక్షన్ చేస్తారని.. ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో వెకిలి చేష్టలకు పాల్పడతారని విమర్శలు వినిపించేవి. వీటన్నిటిని తట్టుకొని బెంగళూరు నిలబడింది. అనేక హేళనలు.. ఇబ్బందులను ఎదుర్కొంది. చివరికి 2025 సీజన్లో ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది.
Also Read : ఇంకో రెండు బాల్స్ కనుక ఉండి ఉంటే.. ఇతడు సగం దేశానికి నిద్రలేకుండా చేసేవాడు!
చివరి మ్యాచ్లో బెంగళూరుకు అంత ఈజీగా విజయం దక్కలేదు. ప్రతి సందర్భంలోనూ అవరోధం ఎదురయింది. ప్రతి సమయంలోను ప్రతికూలత సవాల్ చేసింది. అయినప్పటికీ బెంగళూరు ఆటగాళ్లు ఏమాత్రం నిరాశను తమ దరి చేరనివ్వలేదు. ముఖ్యంగా ప్రారంభం నుంచి చివరి వరకు బెంగళూరు అసలు సిసలైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. అందువల్లే ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. 18 సంవత్సరాల నిరీక్షణకు తెర దించింది. వాస్తవానికి ఐపీఎల్లో ఈ స్థాయిలో ప్రతికూలతలను, అవరోధాలను, ఇబ్బందులను మరే జట్టు కూడా చవిచూడలేదు. ఇవన్నీ దాటుకొని.. కేవలం అభిమానుల సపోర్టుతో.. యాజమాన్యం అండదండలతో బెంగళూరు ఇక్కడ దాకా వచ్చింది. చివరికి కెప్టెన్ ను మార్చిన తర్వాత.. బెంగళూరు తనకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టుకుంది. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ.. మొత్తంగా 18వ ఐపీఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. విజేతగా నిలిచిన తర్వాత కన్నడ జట్టు ఆనందానికి అవధులు అంటూ లేకుండా పోయాయి. ముఖ్యంగా కన్నడ జట్టు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలో చిన్నపిల్లాడిలాగా ఏడ్చేశాడు. తన జీవిత లక్ష్యం నెరవేరింది అంటూ వ్యాఖ్యానించాడు.. తన చివరి వరకు ఐపీఎల్లో కన్నడ జట్టుకు మాత్రమే ఆడతానని పేర్కొన్నాడు. గెలుపు సాధించిన తర్వాత అమాంతం గాల్లోకి ఎగిరి సంబరాలు జరుపుకున్నాడు.
బెంగళూరు విజయం సాధించిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అభిమానులు బీభత్సంగా వేడుకలను జరుపుకుంటున్నారు. బెంగళూరు నగరం అయితే ఆర్సీబీ నామస్మరణతో మార్మోగిపోతుంది. టపాసులు కాల్చి.. బెంగళూరు అభిమానులు తమ సంబరాలను జరుపుకుంటున్నారు. మొత్తంగా తమ జట్టు దురదృష్టకరమైన టీం కాదని.. ఐపీఎల్ విజేత అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.