IND Vs NZ: టీమిండియా – న్యూజిలాండ్ (IND vs NZ) ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions trophy) ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ మైదానంపై 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మిచెల్ (63), బ్రేస్ వెల్(53), ఫిలిప్స్(34) బ్యాటింగ్ లో అదరగొట్టారు. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. ఆ జట్టు ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు 4.5 కు మించి పరుగులు ఇవ్వలేదంటే.. వారు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారు అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ మైదానంపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు టీమిండియా వరుసగా నాలుగు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లపై విజయాలు సాధించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై ముందుగా బౌలింగ్ చేసి, న్యూజిలాండ్ పై ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తక్కువ స్కోర్ నమోదైనప్పటికీ.. భారత్ ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. ఆ మ్యాచ్లో టీమిండియా స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి అయిదు వికెట్లు పడగొట్టాడు.. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ ను వణికించాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
రిటైర్మెంట్ తీసుకునేది అతడేనట..
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి. తన వీడ్కోలు పై రోహిత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. జట్టు మేనేజ్మెంట్ కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సీనియర్ ఆటగాళ్లు గిల్, విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే రోహిత్ కంటే ముందు వన్డేలకు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజా మ్యాచ్లో రవీంద్ర జడేజా తన స్పెల్ ముగించిన తర్వాత.. అతడిని విరాట్ కోహ్లీ కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికే t20 ల నుంచి రవీంద్ర జడేజా తప్పుకున్నాడు.. వన్డేల నుంచి కూడా అతడు రిటైర్ అవుతాడని తెలుస్తోంది. ఇటీవల అశ్విన్, స్మిత్ ను హగ్ చేసుకున్న తర్వాత వారు రిటైర్ అయ్యారు. అయితే రవీంద్ర జడేజా కూడా వన్డేలకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.. 10 ఓవర్లు వేసి, 30 పరుగులు చేసి లాథం ను ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపించాడు. కాగా, సోషల్ మీడియాలో రవీంద్ర జడేజాను విరాట్ కోహ్లీ ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.