Ravindra Jadeja: అతడేం అనామక ఆటగాడు కాదు. బంతితో మాయ చేయగలడు. బ్యాట్ తో ఆకట్టుకోగలడు. మైదానంలో చిరుత లాగా ఫీల్డింగ్ చేయగలడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడు. తనదైన రోజు మ్యాచ్ భారాన్ని మొత్తం ఒక్కడే మోయగలడు.. అలాంటి ఆటగాడు తేలిపోతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో ఫామ్ కోల్పోయి చెత్త రికార్డు నమోదు చేశాడు. బహుశా ఇలాంటి ఫీట్ మరే ఇతర ఆటగాడికి సాధ్యం కాకపోవచ్చు. దీంతో ప్రస్తుతం నెట్టింట అతని గురించే చర్చ జరుగుతోంది.
టి20 వరల్డ్ కప్ కోసం రవీంద్ర జడేజాను ఎంపిక చేసినప్పుడు.. సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అమెరికన్ మైదానాలపై, వెస్టిండీస్ వేదికలపై రవీంద్ర జడేజా రాణిస్తాడని, కీలక సమయంలో ఆదుకుంటాడని అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను రవీంద్ర జడేజా వమ్ము చేస్తున్నాడు. బ్యాట్, బంతి, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలలో చేతులెత్తేశాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో కనీసం అతడు ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు. పరుగులు కూడా చేయలేదు.
భారత్ ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు ఆడింది. ఆడిన అన్నింట్లోనూ గెలిచింది. అయితే ఈ విజయాలలో రవీంద్ర జడేజా పాత్ర దాదాపు శూన్యం. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ గా రవీంద్ర జడేజా వెనుతిరిగాడు. పాకిస్తాన్ జట్టుపై మంచి రికార్డు కలిగి ఉన్న అతడు అలా ఆడటం.. అభిమానులకు రుచించలేదు.. కనీసం రవీంద్ర జడేజా కాసేపు నిలబడినా భారత్ మరింత మెరుగైన స్కోరు సాధించేది. బౌలింగ్లో అతడు ఫామ్ లో లేకపోవడంతో రోహిత్ శర్మ గత మ్యాచ్లో అతడికి బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వలేదు..
రవీంద్ర జడేజా వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. అతడు మంచి ఓపెనింగ్ ఇస్తాడని.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని.. అది టీమిండియా కు లాభం చేకూర్చుతుందని అభిమానులు చెబుతున్నారు. ఇదే సమయంలో కోహ్లీని వన్ డౌన్లోకి దించితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.. ఐపీఎల్ లోనూ ఆశించినంత స్థాయిలో రవీంద్ర జడేజా ఆకట్టుకోలేదు. అంతకుముందు సీజన్లో గుజరాత్ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడి.. చెన్నైని విజేతగా నిలిపాడు. ప్రస్తుతం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.