TDP: టిడిపిలో ఆ కుటుంబానికి ఎనలేని గౌరవం

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత స్థానం ఎవరిది అంటే.. అప్పట్లో ఎర్రంనాయుడు పేరే చెప్పేవారు. 2004లో పార్టీ అధికారానికి దూరమైనా, 2009లో పిఆర్పి ఆవిర్భావంతో సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పినా.. అధినేత చంద్రబాబు వెన్నంటి ఉన్నారు ఎర్రం నాయుడు.

Written By: Dharma, Updated On : June 15, 2024 11:07 am

TDP

Follow us on

TDP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కుటుంబాలు సేవలందిస్తూ వచ్చాయి. ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కొన్ని కుటుంబాలు టిడిపి నే నమ్ముకున్నాయి. అయితే ఏ కుటుంబానికి దక్కని అరుదైన గౌరవం.. కింజరాపు కుటుంబానికి దక్కింది. తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సరైన ప్రాధాన్యాన్ని దక్కించుకుంది ఆ కుటుంబం. ఈ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. అబ్బాయి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. బాబాయ్ అచ్చెనాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. హేమహేమీలను పక్కనపెట్టి మరి కింజరాపు కుటుంబానికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నెన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ఆ కుటుంబానికి టాప్ ప్రయారిటీ కల్పించారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత స్థానం ఎవరిది అంటే.. అప్పట్లో ఎర్రంనాయుడు పేరే చెప్పేవారు. 2004లో పార్టీ అధికారానికి దూరమైనా, 2009లో పిఆర్పి ఆవిర్భావంతో సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పినా.. అధినేత చంద్రబాబు వెన్నంటి ఉన్నారు ఎర్రం నాయుడు. చనిపోయే వరకు పార్టీ పట్ల నిబద్ధత చూపారు. కష్టకాలంలో సైతం పార్టీలోనే కొనసాగారు. అదే పరంపరను కొనసాగించారు ఎర్రం నాయుడు వారసులు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఇబ్బంది పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ బాబాయ్, అబ్బాయి పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. చేయని తప్పుకు అచ్చెనాయుడును కేసులతో వేధించారు కూడా. అయినా సరే వారు వెనకడుగు వేయలేదు. రాష్ట్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వారి కృషిని గుర్తించిన చంద్రబాబు ఒకరిని కేంద్రమంత్రిగా, మరొకరిని రాష్ట్ర మంత్రిగా ఎంపిక చేశారు. ఇతర రాజకీయ కుటుంబాలు అసూయ చెందేలా ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఎర్రనాయుడుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది ఆ ఫ్యామిలీ. ఎన్టీఆర్ పిలిచి మరి ఎర్రన్నకు టిడిపిలో స్థానం ఇచ్చారు. ఏ ముహూర్తాన ఆయనను పార్టీలోకి ఆహ్వానించారో.. అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోలేనంతగా టిడిపి ప్రాధాన్యం ఇచ్చింది. 1995లో టిడిపి సంక్షోభంలో చంద్రబాబు వెంట నడిచారు ఎర్రన్న. అటు తరువాత అధికారానికి దూరమైన తర్వాత కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. అందుకే 1996లో జాతీయ రాజకీయాల్లో ఎర్రన్నను చంద్రబాబు నిలబెట్టారు.

ఎర్రంనాయుడు హఠాన్మరణంతో ఆ కుటుంబ హవా తగ్గుతుందని ప్రత్యర్థులు అంచనా వేశారు. కానీ ఇంతింతై వటుడంతై అన్నంత మాదిరిగా కింజరాపు ఫ్యామిలీ ప్రాబల్యం పెరిగింది. దీని వెనుక చంద్రబాబు ప్రోత్సాహం కూడా ఉంది. ప్రస్తుతం టిడిపి కూటమి అంతులేని మెజారిటీతో గెలిచింది. మంత్రివర్గ కూర్పు కష్టతరంగా మారింది. అయినా సరే చంద్రబాబు మాత్రం కింజరాపు ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎర్రంనాయుడు కుమారుడికి కేంద్ర క్యాబినెట్ హోదా తో కూడిన పదవిని కట్టబెట్టారు. తమ్ముడికి కీలకమైన మంత్రిత్వ శాఖను రాష్ట్రస్థాయిలో ఇచ్చారు. సో విధేయత, మంచితనం, పార్టీ పట్ల అంకిత భావం, అధినేత పట్ల గౌరవం వంటివి కింజరాపు కుటుంబానికి అండగా మారాయి అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.