https://oktelugu.com/

KKR Vs PBKS: పాపం బౌలర్లు… చూస్తుంటే జాలేస్తుంది!

శుక్రవారం ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మంచినీళ్లు తాగినంత సులభంగా చేజ్ చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 27, 2024 / 11:57 AM IST

    KKR Vs PBKS

    Follow us on

    KKR Vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్లో బౌలర్ల పరిస్థితి దారుణంగా మారింది. వాస్తవానికి టి20ల్లో 180 నుంచి 200 పరుగులు చేస్తే భారీ లక్ష్యమని భావిస్తారు. కానీ ఈ సీజన్లో అది ఏ మూలకూ సరిపోడం లేదు.. కనీసం 300 పరుగులను కూడా కాపాడుకోలేని దయనీయ స్థితి ఏర్పడింది. మైదానాలు చిన్నవిగా ఉండడం, అనుకూలంగా తేమ, నిబంధనలు .. ఫలితంగా బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. బౌలర్లు కంటికి ధారగా విలపిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే హైదరాబాద్ జట్టు 287/3, 277/3 భారీ పరుగులు నమోదు చేసింది. శుక్రవారం ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మంచినీళ్లు తాగినంత సులభంగా చేజ్ చేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు బౌలర్ల దయనీయ స్థితి చూసి జాలి పడుతున్నారు. “ఒకప్పుడు ఆఫ్ అండ్ మిడిల్ స్టిక్ మీదుగా దూసుకొచ్చే బంతిని ఆఫ్ సైడ్ మాత్రమే ఆటగాళ్లు ఆడేవారు. అక్కడి నుంచి వైడ్ ఔట్ ఆఫ్ ది స్టంప్ బంతిని సైతం ఫైన్ లెగ్ మీదుగా కొట్టే స్థాయికి బ్యాటర్లు ఎదిగారు. దీనిని బట్టి క్రికెట్ అంటే కేవలం బ్యాటర్లకు మాత్రమే అనేలా పరిస్థితి మారిపోయిందని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    అప్పట్లో అలా ఉండేది

    ప్రుడెన్షియల్ కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో మ్యాచ్ పరిమితి 60 ఓవర్లుగా ఉండేది. ఆ ఓవర్లలో 240 స్కోర్ ను డిపెండబుల్ గా భావించేవారు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన 183 పరుగులు కొట్టలేక వెస్టిండీస్ ఓడిపోయింది. ఆ రోజుల్లో 60 ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 250 రన్స్ చేస్తే చాలు ఈజీగా గెలిచేది. 60 ఓవర్లలో హైయెస్ట్ స్కోరు 334 అంటే ఆటగాళ్లు ఎంత నిదానంగా ఆడేవారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 60 ఓవర్లు 50 కి తగ్గాయి. 50 ఓవర్లలోనూ 250 స్కోర్ అత్యంత అబేధ్యమైనదిగా భావించేవారు. కానీ మెల్లమెల్లగా అది 300 మార్క్ కు చేరింది. దక్షిణాఫ్రికా వేదికగా ఆస్ట్రేలియా జట్టు చేసిన 434 రన్స్ టార్గెట్ ను దక్షిణాఫ్రికా చేజ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ” వాళ్లు ఇంకో 15 పరుగులు తక్కువ సాధించారని” మ్యాచ్ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కలీస్ వ్యాఖ్యానించడం విశేషం. ఓసారి 50 ఓవర్ల మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 470 కొడితే.. ఇంకా నయం 500 కొట్టలేదు అని ఆస్ట్రేలియా జట్టు ఊపిరి పీల్చుకుందట. ఆ తర్వాత 50 ఓవర్ల మ్యాచ్ కూడా అభిమానులకు బోర్ కొట్టడం మొదలైంది. నిర్వాహకులకు కూడా నిర్లిప్తత వచ్చింది.

    పొట్టి ఫార్మాట్లో..

    50 ఓవర్ల మ్యాచ్ కి కాస్తా పొట్టి ఫార్మాట్ గా మారింది. 50 నుంచి 20 ఓవర్లకు తగ్గింది. ఆ 20 ఓవర్ల మ్యాచ్ లో 160 కొడితే గొప్ప అని అందరూ భావించేవారు. కానీ, అది మెల్లిమెల్లిగా 180 కి, ఆ తర్వాత 200కు రీచ్ అయింది. 225 కూడా చేరుకోవడం.. దానిని సులువుగా ఛేదించడం సర్వ సాధారణమైపోయింది. అయితే 277 రన్స్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 241 చేయడం, 287 టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో 262 బాదడం, 261 రన్స్ ను అత్యంత సులభంగా ఛేదించడాన్ని చూస్తూంటే క్రికెట్ కాస్తా బ్యాట్స్ మెన్ ప్యార డైజ్ గా మారింది.

    నిబంధనలు మార్చాలి

    పరుగుల వరద పారుతున్న నేపథ్యంలో నిబంధనలు మార్చాలని సీనియర్ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.. ముఖ్యంగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. “బౌలర్లను ఎవరైనా కాపాడండి” అంటూ అతను చేసిన ట్వీట్ చర్చకు దారితీస్తోంది. దీనికి మరో బౌలర్ చాహల్ దేవుడికి దండం పెట్టే ఎమోజిని రిప్లై గా ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ సైతం బ్యాటర్లు భారీ పరుగులు చేయడాన్ని, మైదానాలను ఆ విధంగా రూపొందించడాన్ని తప్పట్టాడు. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం బౌండరీల దూరం పెంచాలని విన్నవిస్తున్నారు. ఇదే సమయంలో జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో బ్యాటర్ల హవా సాగడం పట్ల అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా సాగే ఆట కంటే బ్యాట్, బంతి మధ్య సరైన పోరు ఉంటేనే క్రికెట్ లో మజా వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.