WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ – ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జరగనుంది. ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మ్యాచ్ పట్ల ఆసక్తి పెరిగింది. మ్యాచ్ కు మూడు రోజులే సమయం ఉండడంతో భారత జట్టు మాజీ క్రికెటర్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా ఇండియా జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఈ ఫైనల్ పోరులో బలమైన ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడుతున్నాయి. గతంలో జరిగిన డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో భారత జట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగానే ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది అనే దానిపై వివిధ దేశాలకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీరిలో చాలా మంది ఆస్ట్రేలియా జట్టును ఫేవరెట్ గా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా ఆసక్తిని కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా ఫేవరెట్ గా ఉంది.. కానీ జాగ్రత్తగా ఉండాలి..
ఈ రెండు జట్ల గురించి రవి శాస్త్రి మాట్లాడుతూ.. ” భారత్.. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ లో ఆడుతోందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఆస్ట్రేలియా ఫేవరెట్ గా ఉంది. కానీ, ఇది ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్. ఒక్కరోజు బాగా ఆడకపోయినా మ్యాచ్ చేజారినట్టే. కాబట్టి ఆస్ట్రేలియా కూడా జాగ్రత్తగా ఉండాలి” అని వెల్లడించారు. ఐసీసీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్ల నిరీక్షణకు తెరడిందించుతూ ఈసారి టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవొచ్చని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
గట్టిగా పోరాడితేనే ఐసీసీ టోర్నీలో విజయం సాధ్యం..
ఐసీసీ టోర్నీలో ఎవరైనా సరే గట్టిగా పోరాడాల్సిందేనని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఎదుటి జట్టుతో పోలిస్తే బలంగా ఉన్నామని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఓటమి తప్పదని హెచ్చరించాడు. అయితే, కొన్నిసార్లు కొంత అదృష్టం కూడా కలిసి రావాలని, మంచి క్రికెట్ ఆడలేదని చెప్పలేనని ఈ సందర్భంగా రవి శాస్త్రి స్పష్టం చేశారు. కొన్నిసార్లు అదృష్టం కలిసి రాకపోయినా విజయాలు సాధ్యం కావన్నారు. ఈ టీమ్ కు ఐసిసి ట్రోఫీ గెలిచే సత్తా ఉందని, తాను కోచ్ గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెబుతుండే వాడినని ఆయన వెల్లడించారు. గడిచిన మూడు, నాలుగు వేల నుంచి ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నమ్ముతున్నట్లు రవి శాస్త్రి పేర్కొన్నారు. ఆ శక్తి ఆటగాళ్లలో ఇప్పటికీ ఉందని తాను భావిస్తున్నట్లు ఈ భారత జట్టు మాజీ కోచ్ వివరించాడు.